Begin typing your search above and press return to search.

జగన్ సర్కారుపై అనుచిత వ్యాఖ్యలు..యువకుడి అరెస్ట్

By:  Tupaki Desk   |   30 Sep 2019 4:52 AM GMT
జగన్ సర్కారుపై అనుచిత వ్యాఖ్యలు..యువకుడి అరెస్ట్
X
విమర్శ వేరు.. బూతులు తిట్టటం వేరు. విమర్శిస్తే కేసు ఉండదు. కానీ.. బూతులు తిడుతూ.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే కేసు నమోదు కావటమే కాదు.. అరెస్ట్ కూడా కావాల్సి ఉంటుందన్న విషయం తాజాగా మరోసారి రుజువైంది. చేతిలో సెల్ ఫోన్.. దానికో కెమేరా.. అంతే.. నోటికి వచ్చినట్లు మాట్లాడేయటం.. ఆ క్లిప్పుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఎంతటి ప్రమాదకరమైన విషయమన్నది తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. నోటికి వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరికి ఉండదని.. అలాంటి అత్యుత్సాహం కొత్త తిప్పల్ని తెచ్చి పెడుతుందన్న విషయం తాజాగా ఉదంతాన్ని చూస్తే.. అర్థం కాక మానదు.

ఇటీవల ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షా విధానంలో కీలక మార్పులు చేసింది. అయితే.. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా.. ఇలాంటి మార్పులు చేయటం ఏమిటన్న ప్రశ్న వరకూ ఓకే. కానీ.. ఆ పేరుతో జగన్ సర్కారుపైనా.. విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఖండనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వీడియోపైన మంత్రి అనుచరులు యర్రగొండ పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ప్రకాశం జిల్లా వినుకొండ మండలం నాగులవరం గ్రామానికి చెందిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు పాఠశాలలో అక్రమాల్ని అడ్డుకట్ట వేసేందుకే పదో తరగతి పరీక్షా విధానాన్ని మార్పులు చేసినట్లుగా ఏపీ విద్యా శాఖా మంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఈ నిర్ణయంపై అనుచిత రీతిలో చేసిన వ్యాఖ్యలు.. సదరు యువకుడికి చిక్కుల్ని తెచ్చి పెట్టాయని చెప్పక తప్పదు.