Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న : ఇద్ద‌రు ఎమ్మెల్యేల జంప్

By:  Tupaki Desk   |   29 Sep 2015 7:01 AM GMT
జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న : ఇద్ద‌రు ఎమ్మెల్యేల జంప్
X
ఏపీలో ప్ర‌తిప‌క్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. పార్టీని బ‌లోపేతం చేసేందుకు, ప్ర‌జ‌ల్లో పార్టీ ప‌ట్ల సానుకూల‌త పెంచేందుకు పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేస్తుంటే అందుకు భిన్నంగా పార్టీ నేత‌లు టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా ఈ ప‌రిస్థితి ఎక్క‌డికి చేరిందంటే...జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌నున్న జిల్లాలోనే జంప్ చేసేందుకు ఎమ్మెల్యేలు రెడీ అయిపోతున్నారు.

ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 30 న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు టంగుటూరులో రైతు సమస్యలపై ధర్నా నిర్వహించనున్నారు. ఈమేర‌కు హైదరాబాద్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా పార్టీ నేతలు - ప్రజాపతినిధులు జగన్మోహన్‌ రెడ్డితో సమావేశమై పొగాకు రైతుల సమస్యలు, ఆత్మహత్యలపై చర్చించారు. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యలు పరిష్కరించేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ధ‌ర్నా చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించారు. అయితే ఇదే ప్ర‌కాశం జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పార్టీకి చెందిన‌ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి సైకిలెక్కేందుకు సిద్ధమైనట్లు ప్రచారం ఉంది.

ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. పార్టీ పరంగా జిల్లాలో ఇటీవల జరిగిన కార్యక్రమాలకు వీరిద్దరు దూరంగా ఉంటుండటం ఊహాగానాలకు తావిస్తోంది. వీరిని టీడీపీలో చేర్చుకునేందుకు పార్టీ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్‌ సిగ్నల్ కూడా ఇచ్చారని ప్రచారం సాగుతోంది. జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను వైసీపీ ఆరు,టీడీపీ ఐదు ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకోగా, చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ ఇటీవల తెలుగుదేశంలో చేరిపోయారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెరి ఆరు స్థానాలు ఉన్నట్లయ్యింది. తాజాగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్న నేపధ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు ఒక‌రోజు అటూఇటుగా ఈ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.