Begin typing your search above and press return to search.

ఏపీలో ప్ర‌కాశ్ రాజ్ మ‌ద్ద‌తు ఎవ‌రికి?

By:  Tupaki Desk   |   26 Nov 2018 7:30 AM GMT
ఏపీలో ప్ర‌కాశ్ రాజ్ మ‌ద్ద‌తు ఎవ‌రికి?
X
విల‌క్ష‌ణ న‌టుడిగా జ‌నం మ‌న‌సుల్ని గెల్చుకొని రాజ‌కీయాల వైపు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న ప్ర‌కాశ్ రాజ్ తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో త‌న మ‌ద్ద‌తు టీఆర్ ఎస్‌ కేన‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మ‌ళ్లీ గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ నే సీఎం చేయాల‌ని ప్రజ‌ల‌కు పిలుపునిచ్చారు. నాలుగున్న‌రేళ్లుగా కేసీఆర్‌ - టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని చూశాను కాబ‌ట్టే తాను వారికి మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప్ర‌కాశ్ రాజ్ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్నార‌నే విష‌యంపై ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా చ‌ర్చ న‌డుస్తోంది. తాజాగా ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌ తో ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్ర‌కాశ్ రాజ్ ఈ విష‌యంపై త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. ఏపీలో తాను ఎవ‌రివైపు నిలబ‌డ‌బోతోంది స్ప‌ష్టంగా చెప్ప‌న‌ప్ప‌టికీ.. ఆయ‌న స‌మాధానాలు మాత్రం ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

తొలుత జ‌న‌సేన గురించి ప్ర‌కాశ్ రాజ్ స్పందిస్తూ.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న సంక‌ల్పంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినీ రంగాన్ని వ‌దిలి రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని తెలిపారు. ఆయ‌న ఉద్దేశాన్ని త‌ప్పుప‌ట్టేలేమ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే - జ‌న‌సేన పార్టీ నిర్మాణం ఇంకా పూర్తిగా జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతానికి ఆ పార్టీలో ప‌వ‌న్ ఒక్క‌డే నాయ‌కుడ‌ని చెప్పారు.

వైసీపీ విష‌యానికొస్తే ప్ర‌స్తుతానికి జ‌గ‌న్ బాగానే పోరాడుతున్నార‌ని అన్నారు. ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి ఆయ‌న బీజేపీకి అమ్ముడుపోతారా? లేదా? అనే సంగ‌తి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఇక చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో క‌లిసి న‌డుస్తున్న సంగ‌తిని గుర్తుచేశారు. ఆ పార్టీల ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌లు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందేన‌న్నారు.

కాబ‌ట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఏ పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌నే సంగ‌తిని అక్క‌డి ప‌రిస్థితుల‌ను కూలంక‌షంగా విశ్లేషించి తాను నిర్ణ‌యించుకుంటాన‌ని ప్ర‌కాశ్ రాజ్ తెలిపారు. ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా ఆర్నెళ్ల స‌మ‌యం ఉంద‌ని గుర్తుచేశారు. ఆలోగా ప‌రిస్థితుల‌న్నింటినీ అవ‌గ‌తం చేసుకొని.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌తార‌నే విశ్వాసం ఎవ‌రిపై క‌లిగితే వారికే తాను మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.