Begin typing your search above and press return to search.

మ‌తంపై ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   6 April 2018 7:15 AM GMT
మ‌తంపై ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఆ మ‌ధ్య వ‌ర‌కూ త‌న దారిన తాను అన్న‌ట్లుగా ఉండే విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌.. ఈ మ‌ధ్య‌న చేస్తున్న వ్యాఖ్య‌ల కార‌ణంగా త‌ర‌చూ వార్త‌ల్లోకి వ‌స్తున్నారు. త‌న‌కెంతో మంచి స్నేహితురాలైన గౌరీ లంకేశ్ హ‌త్య ప్ర‌కాశ్ రాజ్ లో చాలా మార్పును తీసుకొచ్చింద‌ని చెబుతారు. త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌కు చెప్పేందుకు ఏ మాత్రం మొహ‌మాట ప‌డ‌ని ప్ర‌కాశ్ రాజ్.. వివాదాల‌కు అస్స‌లు వెర‌వ‌ర‌ని చెబుతారు.

అలాంటి ఆయ‌న తాజాగా మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ‌లో విలేక‌రుల‌తో మాట్లాడిన ఆయ‌న మ‌తాల మీదా.. మీడియా మీదా విమ‌ర్శ‌లు సంధించారు. పాత్రికేయులు ప్ర‌శ్నించే అల‌వాటును మ‌ర్చిపోతున్నార‌ని విచారం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. జ‌ర్న‌లిస్టులు త‌మ తీరును మార్చుకోవాల‌న్నారు.

గోహ‌త్య చేసిన వారు త‌ల్లి త‌ల న‌రికిన వారితో స‌మాన‌మ‌ని క‌న్న‌డ న‌టుడు చిరంజీవి స‌ర్జా న‌టించిన సీజ‌ర్ చిత్రంలోని డైలాగుల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. గోహ‌త్య‌పై చేసిన వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌ట్టారు. తాను వెళ్లిన చోట కొంద‌రు మ‌త ఛాంద‌స‌వాదులు ఆవు పేడ‌తో క‌ళ్లాపి చ‌ల్లి.. గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారని చెప్పారు.

గోవు కొబ్బ‌రికాయ హిందూ మ‌తంలోకి ఎప్పుడు చేరాయి? అని ప్ర‌శ్నించిన ప్రకాష్ రాజ్‌.. ఖ‌ర్జురం.. గొర్రె ముస్లిం మ‌తంలోకి ఎప్పుడు వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించారు. ఇవి ఆయా మ‌తాల్లోకి ఎప్పుడు చేరాయ‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. తాను ఏ పార్టీకి చెందిన నాయ‌కుడిని కాద‌న్నారు. అణ‌గారిన వ‌ర్గాల‌కు మాత్ర‌మే తాను మ‌ద్ద‌తుగా నిలుస్తాన‌ని చెప్పారు.

రాజ్యాంగ‌బ‌ద్ధంగా ప్ర‌మాణం చేసి ప‌వ‌ర్లోకి వ‌చ్చిన కొంద‌రు నాయ‌కులు ఆ రాజ్యాంగాన్నే మార్చేస్తామంటూ మాట్లాడ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఆహార ప‌ద్ద‌తులను ప్ర‌శ్నించే నాయ‌కుల‌కు మ‌నుషులు క‌నిపించ‌రా? అని నిల‌దీశారు.

బీజేపీ నేత‌ల్ని ప్ర‌శ్నించేందుకు తాను ఎప్పుడు వెన‌క్కి త‌గ్గ‌నని స్ప‌ష్టం చేసిన ప్ర‌కాశ్ రాజ్‌.. బీజేపీ నేత‌లు ఇచ్చే సందేశాల్ని ప్ర‌శ్నించేందుకు ఇప్ప‌టికే తాను 2500 మందితో ఒక బృందాన్ని సిద్ధం చేసుకున్న‌ట్లు చెప్పారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ప్ర‌కాశ్ రాజ్ నోటి వెంట మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు రావ‌టం ఖాయ‌మ‌న్న‌ట్లుందే.