Begin typing your search above and press return to search.

ఏపీ హోదాపై గ‌ళం విప్పిన ప్ర‌కాశ్ రాజ్‌

By:  Tupaki Desk   |   18 Nov 2017 10:01 AM GMT
ఏపీ హోదాపై గ‌ళం విప్పిన ప్ర‌కాశ్ రాజ్‌
X
వీధుల్లోకి వ‌చ్చి పోరాడ‌న‌క్క‌ర్లేదు. స‌త్యాగ్ర‌హాలు అస్స‌లే చేయ‌న‌క్క‌ర్లేదు. చివ‌ర‌కు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న కూడా అక్క‌ర్లేదు. ఒక్క మాట‌.. ఒకే ఒక్క మాట‌. అది కూడా అన్యాయానికి వ్య‌తిరేకంగా.. న్యాయానికి బాస‌ట‌గా మాత్ర‌మే. వెండితెర మీద వెలిగిపోయే తార‌లు.. అన్యాయంపై క‌త్తులు దూయ‌ట‌మే కాదు.. విల‌న్‌ను ఉతికి ఆరేసే హీరోలంతా మౌనంగా ఉన్న వేళ‌.. మిగిలిన ప్ర‌ముఖులు వారిని మూగ‌గా ఫాలో అవుతున్న స‌మ‌యంలో అందుకు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌.

ఆయ‌న‌కు స‌న్నిహితురాలైన ప్ర‌ముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ పాశ‌విక హ‌త్య జ‌రిగిన నాటి నుంచి ప్ర‌కాశ్ రాజ్ లో మార్పు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. అన్యాయంపై గ‌ళం విప్పుతున్నారు. త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు. పాల‌కుల‌కు ఇబ్బంది క‌లిగేలా ప్ర‌శ్నిస్తున్నారు. ఇదేం ఆయ‌న ప్ర‌త్యేక‌మైన అజెండాతో చేయ‌టం లేదు. ప్ర‌శ్నించే గుణం ఉన్న ఒక మంచి జ‌ర్న‌లిస్టును దారుణంగా హ‌త్య చేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఆమె మ‌ర‌ణాన్ని కొంద‌రు సంబ‌రాలు చేసుకోవ‌టాన్ని త‌ట్టుకోలేక‌పోయారు ప్ర‌కాశ్ రాజ్‌.

ఒక హ‌త్య జ‌రిగిన త‌ర్వాత కొంద‌రు సంబ‌రాలు చేసుకోవ‌టం ఏమిటి? ప‌్ర‌జాస్వామ్య దేశంలో ఇది దుర్మార్గ‌మ‌ని మాత్ర‌మే తాను ప్ర‌శ్నించాన‌ని.. భార‌త‌దేశంలో ఒక పౌరుడిగా మాత్ర‌మే స్పందించాన‌ని.. దానికే ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా.. బీజేపీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న‌ట్లుగా చిత్రీక‌రించార‌న్నారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌న్న ఆయ‌న‌.. ఒక ఓట‌రుగా.. ఈ దేశ పౌరుడిగా ప్ర‌జాస్వామ్యం త‌న‌కు క‌ల్పించిన హ‌క్కు.. ప్ర‌శ్నించ‌ట‌మని.. తాను ప్ర‌భుత్వాన్ని కాక మ‌రెవ‌రిని ప్ర‌శ్నిస్తాన‌ని క్వ‌శ్చ‌న్ చేశారు.

త‌న‌కు బాగా తెలిసిన స్నేహితురాలి హ‌త్య‌తో దుర్మార్గం త‌న గ‌డ‌ప తొక్కింద‌ని.. అప్ప‌టినుంచే తాను ప్ర‌శ్నించ‌టం మొద‌లు పెట్టిన‌ట్లుగా చెప్పారు. త‌న‌కు దేశంలోని ఏ రాజ‌కీయ‌పార్టీతో స్నేహం కానీ వైరం కానీ లేవ‌న్నారు. తాను ఏ రాజ‌కీయ పార్టీలో చేర‌టం లేద‌ని.. 2019 ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌టం లేద‌న్నారు.

విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని నెర‌వేర్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. విభ‌జ‌న కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు అన్యాయం జ‌రిగింద‌ని ప్ర‌కాశ్ రాజ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాకు సంబంధించి కేంద్రం హ్యాండ్ ఇచ్చింద‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. కానీ.. సెల‌బ్రిటీలు.. సినీ ప్ర‌ముఖుల్లో వేళ్ల మీద లెక్క‌పెట్టగ‌లిగినంత మంది మాత్ర‌మే ఏపీ ప్ర‌త్యేక హోదా మీద మాట్లాడార‌ని చెప్పాలి. మిగిలిన వారు నోరు విప్పింది లేదు.

తెలుగు సినిమాల్లో న‌టించటం మిన‌హా.. తెలుగు వాడు కాని ప్ర‌కాశ్‌ రాజ్ సైతం ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడారు కానీ మిగిలిన వారి నోటి నుంచి ఆ మాట వ‌చ్చిందే లేదు. హోదా విష‌యంలో తెలుగు న‌టుల‌తో పోలిస్తే ప్ర‌కాశ్ రాజ్ చాలా బెట‌ర్ అని చెప్పాలి. మిగిలిన వాళ్లు ఆయ‌న్ను చూసి సిగ్గు ప‌డితే మంచిదన్న భావ‌న‌ను ప‌లువురు ఆంధ్రోళ్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌న ప‌లుసామాజిక అంశాల మీద ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శ్నించ‌టాన్ని కొంద‌రు ఎద్దేవా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌కాశ్ రాజ్‌కు సినిమాలు లేవ‌ని అందుకే ఇలా కాల‌క్షేపం చేస్తున్న‌ట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విష‌యాన్ని ప్రకాశ్ రాజ్ ను ప్ర‌శ్నిస్తే ఆయ‌న చెప్పిన స‌మాధానం ఏమిటో తెలుసా? వ‌చ్చే ఏడాదిన్న‌ర వ‌ర‌కూ త‌న కాల్షీట్లు లేవ‌ని.. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఉన్న కొద్ది టైంను స‌మాజం ప‌ట్ల అవ‌గాహ‌న‌తోనే తాను ప్ర‌శ్నిస్తున్న‌ట్లుగా ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. పేరు ప్ర‌ఖ్యాతులు రాగానే.. తామేదో ఆకాశం నుంచి ఊడిప‌డిన‌ట్లుగా ఫీల‌య్యే సెల‌బ్రిటీలు ప్ర‌కాశ్ రాజ్ ను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.