Begin typing your search above and press return to search.

జాతీయ‌ప‌క్షిగా కాకి.. ఎవ‌రు డిమాండ్ చేశారంటే?

By:  Tupaki Desk   |   23 April 2018 5:42 PM GMT
జాతీయ‌ప‌క్షిగా కాకి.. ఎవ‌రు డిమాండ్ చేశారంటే?
X
అందుకే అనేది.. కొత్త నీరు లెక్కే వేరుగా ఉంటుంది. ఉరిమే ఉత్సాహం.. కొత్త శోభ కొత్త నీటిలో ఉంటుంది. రాజ‌కీయాల్లో ద‌శాబ్దాలుద‌శాబ్దాలుగా సాగుతూ అనుభ‌వం అనే ర‌క్ష‌ణ క‌వ‌చాన్ని క‌ప్పుకు తిరిగే నేత‌ల‌కు.. కొత్త‌గా రాజ‌కీయాల్లోకి రావాల‌ని త‌హ‌త‌హ‌లాడే వారికి మ‌ధ్య అంత‌రం ఎక్కువ‌గా ఉంటుంది.

గ‌డిచిన కొంత‌కాలంగా రాజ‌కీయాల మీద విరుచుకుప‌డుతున్న ప్ర‌కాశ్‌రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. బీజేపీ పేరు ఎత్తితేనే ఇంతెత్తున ఎగిరిప‌డే ప్ర‌కాశ్ రాజ్‌.. తాజాగా మాండ్యాలో మాట్లాడారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలో బీజేపీ కానీ అధికారంలోకి వ‌స్తే త‌న ప్రాణాల‌కు గ్యారెంటీ ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. బీజేపీ కానీ ప‌వ‌ర్లోకి వ‌స్తే త‌న‌ను ఏదో ఒక‌టి చేయ‌టం ఖాయ‌మ‌న్న ఆయ‌న‌.. ఇటీవ‌ల క‌ల‌బుర‌గిలో క‌మ‌ల‌నాథులు త‌న‌పై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించార‌న్నారు.

హిందువులు ఎక్కువ‌గా ఉన్న దేశం నేప‌థ్యంలో దేశాన్ని హిందూ దేశంగా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్‌పై ప్ర‌కాశ్ రాజ్ అదిరిపోయేలా రియాక్ట్ అయ్యారు. ఆయ‌న పంచ్ చూస్తే.. ప్ర‌కాశ్ రాజ్ లాంటోళ్లు రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. ఇప్ప‌టికే పాలిటిక్స్ లోకి ఉన్నోళ్ల‌కు స‌మాధానాలు చెప్పేందుకు మాట‌లు వెతుక్కునే ప‌రిస్థితి వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. ఎందుకిలా అంటే.. హిందూదేశంగా ప్ర‌క‌టించాల‌న్న బీజేపీ నేత‌ల వాద‌న‌కు చెక్ చెబుతూ.. ప్ర‌కాశ్ రాజ్ ఆస‌క్తిక‌ర వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు.

జాతీయ ప‌క్షి అయిన నెమ‌లి కంటే దేశంలో కాకుల సంఖ్య ఎక్కువ‌ని.. అందువ‌ల్ల నెమలి స్థానంలో కాకిని జాతీయ‌ప‌క్షిగా ఎంపిక చేస్తామా? అని సూటిగా ప్ర‌శ్నించారు. కేవ‌లం ఒక మ‌తం ఆధారంగా దేశానికి ముద్ర వేయ‌టం మూర్ఖ‌త్వ‌మ‌న్న ఆయ‌న‌.. కాకి ఉదాహ‌ర‌ణ‌తో బీజేపీ నేత‌ల‌కు మ‌రింత మంట పుట్టేలా చేశారని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌కాశ్ రాజ్ కాకి వ్యాఖ్య‌పై బీజేపీ నేత‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.