Begin typing your search above and press return to search.

వాళ్లు వీధి కుక్కలు..నోరు పారేసుకున్న కేంద్రమంత్రి!

By:  Tupaki Desk   |   21 Jan 2018 10:21 AM GMT
వాళ్లు వీధి కుక్కలు..నోరు పారేసుకున్న కేంద్రమంత్రి!
X

కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్ హెగ్డే మళ్లీ నోరు పారేసుకున్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన దళిత వ్యక్తులను వీధి కుక్కలని అన్నారు. శనివారం కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి హెగ్డే వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్‌ ను కొందరు అడ్డుకొని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొందరు వీధి కుక్కల నిరసనలకు తలొగ్గే ప్రసక్తే లేదు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీకు సాయం చేయడానికి కంకణం కట్టుకున్నాం. ఏం జరిగినా మీతోనే ఉంటాం. మన ప్రజల క్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. ఇలాంటి వీధి కుక్కల నిరసనలను తలొగ్గం అని అనంత్‌ కుమార్ స్పష్టంచేశారు.

అయితే హెగ్డేను తీవ్రంగా వ్యతిరేకించే నటుడు ప్రకాశ్ రాజ్ మంత్రి కామెంట్స్‌ ను తప్పుబట్టాడు. రాజ్యాంగాన్నే మారుస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపిన దళితులను కుక్కలని హెగ్డే అన్నారని, మరి ఇప్పటికైనా బీజేపీ నేతలు ఆయనను తొలగిస్తారా లేక ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటూ ట్విట్టర్‌ లో ప్రశ్నించాడు.

మ‌రోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం కేంద్ర‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా మండిపడింది. ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే హెగ్డే మాత్రం తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే కాంగ్రెస్ ఇలా చేస్తున్నదని - తనను వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు.