Begin typing your search above and press return to search.

కేసీఆర్ చూపించిన సినిమాకు ప్ర‌కాశ్ రాజ్ ఫిదా

By:  Tupaki Desk   |   30 March 2018 5:17 AM GMT
కేసీఆర్ చూపించిన సినిమాకు ప్ర‌కాశ్ రాజ్ ఫిదా
X
దేశంలో బీజేపీ - కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గుణాత్మ‌క రాజ‌కీయాల‌కు వేదిక‌గా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న దూకుడు కొన‌సాగిస్తున్నారు. దక్షిణాదిభాషలతోపాటు - హిందీ చిత్రాల్లో వందల కొద్ది పాత్రలు పోషించి జాతీయస్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు పొందిన ప్ర‌కాశ్ రాజ్‌ తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. కొంతకాలంగా ప్ర‌కాశ్‌రాజ్‌ పలు సామాజిక అంశాలపై పోరాడుతున్న విషయం తెలిసిందే. మహబూబ్‌ నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని సొంత ఖర్చులతో దానిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రముఖ రచయిత్రి గౌరీలంకేశ్ హత్యోదంతంపై ఆయన స్పందించిన తీరు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రకాశ్‌ రాజ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో ఇటీవల ఒక చర్చాగోష్ఠిలో పాల్గొన్న ప్రకాశ్‌ రాజ్ తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలపై ఆసక్తి కనబర్చారు. అదే నాందిగా తాజాగా ఆయ‌న‌తో కేసీఆర్‌ చ‌ర్చించారు.

గురువారం ఉదయం ప్రగతిభవన్‌ కు వచ్చిన ప్ర‌కాశ్ రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో పాటుగా అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ బిల్లుపై కేసీఆర్ ప్రసంగాన్ని ఆయన సందర్శకుల గ్యాలరీలో కూర్చుని ఆసక్తిగా విన్నారు. శాసనసభ నిర్వహణను - సభ జరుగుతున్న తీరును స్వయంగా చూశారు. సభ ముగిసేవరకు అక్కడే ఉన్న ప్రకాశ్‌ రాజ్ తిరిగి సీఎంతో కలిసి ప్రగతిభవన్‌ కు వచ్చారు. అక్కడ ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు - ఉద్దేశాలు - ఎజెండా అంశాల రూపకల్పనను ప్రకాశ్‌ రాజ్‌ కు వివరించినట్టు సమాచారం. కోల్‌ కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జరిగిన భేటీ విశేషాలు ప్రకాశ్‌ రాజ్‌ కు వివరించినట్టు సమాచారం.

దేశంలో గుణాత్మకమార్పును తీసుకురావడమే ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌ కు వివరించినట్టు తెలిసింది. దేశంలో బీజేపీ - కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకతను తెలిపారు. ఫ్రంట్ భవిష్యత్ కార్యాచరణ - నిర్మాణంపై తన ఆలోచనలను పంచుకున్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న తీరు - రాష్ట్ర స్థాయిలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకునేవిధంగా ఉన్న చట్టాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తో త‌న ఆలోచనలను ప్రకాశ్‌ రాజ్ పంచుకున్నారు. తాను దత్తత తీసుకున్న మహబూబ్‌ నగర్ జిల్లా షాద్‌ నగర్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో చేపడుతున్న కార్యక్రమాలను సీఎంకు వివరించినట్టు తెలిసింది. తాము కూడా దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పును కోరుకుంటున్నామని, ఫెడరల్ ఫ్రంట్‌ లో భాగస్వామిగా ఉంటూ రాజకీయాల్లో మార్పునకు తనవంతు కృషిచేస్తానని సీఎంతో చెప్పినట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలను కొనియాడిన ప్రకాశ్‌ రాజ్ రైతుబంధు అద్భుతమైన పథకమని ప్రశంసించారు.