Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన ప్రకాష్ రాజ్

By:  Tupaki Desk   |   20 May 2019 8:25 AM GMT
ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన ప్రకాష్ రాజ్
X
ప్రతిపక్ష కాంగ్రెస్ కంటే కూడా మోడీని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. బీజేపీ ఓటమి ధ్యేయంగా రగిలిపోయి ఈ దఫా ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. పార్లమెంట్ లో అడుగుపెట్టి బీజేపీని చెడుగుడు ఆడుతానని నినదించారు. నరనరాన బీజేపీ వ్యతిరేకతను నింపుకున్న ప్రకాష్ రాజ్ బీజేపీ ఓటమే ధ్యేయంగా ప్రచారం చేశారు. అయితే ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ షాకిచ్చాయి. దీనిపై ఆయన నేరుగా స్పందించారు.

ప్రకాష్ రాజ్ తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై తనదైన శైలిలో స్పందించారు. దేశంలోని జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలన్నీ మళ్లీ ప్రధాని మోడీ అవుతారని స్పష్టం చేశాయి. అయితే మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న ప్రకాష్ రాజ్ ఈ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని స్పష్టం చేశారు.

ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. సర్వేలు నిజం కాదని.. అధికారికంగా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాకే నమ్మండని ప్రజలకు సూచించారు. కొందరు ఎగ్జిట్ పోల్స్ తో పగటి కలలుగంటున్నారని.. ఎన్నికల విడుదలయ్యే వరకూ ఇలానే పగటికలలు కనండని.. తర్వాత చూడండని ప్రకాష్ రాజ్ సెటైర్ వేశారు. ప్రజల తీర్పు మే 23వ తేదీన వెలువడుతుందని.. సర్వేలు ఏమీ చెప్పినా ప్రజల తీర్పే ముఖ్యమని అన్నారు. అప్పటి వరకు మహాత్మాగాంధీ రఘుపతి రాఘవ రాజారాం పాట పాడుకోవాలని ట్వీట్ లో ప్రజలకు సూచించారు.

ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఈయనపై బీజేపీ తరుఫున సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్, కాంగ్రెస్ నుంచి రిజ్వాన్ అర్షద్ పోటీచేశారు. ఆప్ పార్టీ ప్రకాష్ రాజ్ కు మద్దతిచ్చింది. అయితే పోలింగ్ సరళిని బట్టి ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లో ఓడిపోతాడని సర్వేల్లో తేలుతోంది. అయితే ప్రజల తీర్పు ముఖ్యం అంటున్నారు ప్రకాష్ రాజ్. చూడాలి మరి ప్రకాష్ రాజ్ ఆశ నెరవేరుతుందో లేదో..