Begin typing your search above and press return to search.

ప్రకాష్‌ రాజ్‌ కు గడ్డుకాలమేనా..!

By:  Tupaki Desk   |   13 March 2019 4:45 AM GMT
ప్రకాష్‌ రాజ్‌ కు గడ్డుకాలమేనా..!
X
ప్రకాష్‌ రాజ్‌.. ఈ పేరు చెబితేనే.. బహుభాషా నటుడు.. మంచి నటుడు.. ఫ్యామిలీ కథా చిత్రాల్లో హీరోయిన్‌ తండ్రిగా చాలా పాత్రల్లో ఒదిగిపోయారు. తెలుగు - కన్నడ - తమిళ - మలయాళ చిత్రాల్లో నటించారు. ఎంతోమంది అభిమానులను చూరగొన్నారు. అయితే ఉన్నఫలంగా గతేడాది 2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరపైకి వివాదాస్పద వ్యాఖ్యలతో తెరపైకి వచ్చారు. బెంగళూరులో ప్రెస్‌ మీట్‌ లు పెట్టి బీజేపీకి ఓటు వేయద్దు అని బహిరంగంగా సూచనలు ఇస్తూ వచ్చారు.

బీజేపీకి తప్ప ఏ పార్టీకి ఓటు వేసినా తనకు సమ్మతమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే అనతి కాలంలోనే రాజకీయ అరంగేట్రం చేసేందుకు ప్రకాశ్‌ రాజ్‌ వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు. బెంగళూరు సెంట్రల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని స్పష్టం చేశారు. అయితే బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గంలో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కాంగ్రెస్‌ కూడా తగిన ప్రాబల్యం ప్రదర్శించనుంది. ఈ క్రమంలో మూడో అభ్యర్థిగా బరిలో దిగే నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కు గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

బెంగళూరు సెంట్రల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ – బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఈ క్రమంలో మూడో అభ్యర్థిగా ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్య్రంగా పోటీ చేస్తే గెలుపు అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ప్రకాష్‌ రాజ్‌ స్వస్థలం కర్ణాటక అయినప్పటికీ ఆయనకు తెలుగు ప్రాంతాల్లోనే ఎక్కువ అభిమానులు ఉన్నారని స్థానికంగా టాక్‌. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశ్‌ రాజ్‌ ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప సాధించేది ఏమీ లేదని బీజేపీ - కాంగ్రెస్‌ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్‌ ఎంపీగా బీజేపీ నాయకులు పీసీ మోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నరు. గత 2009 - 2014లో ఆయన ఎంపీగా గెలిచారు. కాగా కాంగ్రెస్‌ నుంచి 2014లో రిజ్వాన్‌ అర్షద్‌ పోటీ చేసి ఓడిపోయారు. సుమారు 1.37 లక్షల ఓట్ల తేడాతో రిజ్వాన్‌ ఓటమి పాలయ్యారు.

రాజాజినగర్ - శివాజీనగర - శాంతినగర - సర్వజ్ఞనగర్ - గాంధీనగర్ - మహదేవపుర - సీవీ రామన్‌ నగర్ - చామరాజపేటె అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో సీవీ రామన్‌ నగర్ - రాజాజినగర్ - మహదేవపుర మినహా మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. మొత్తం ఎనిమిది స్థానాల్లో బీజేపీ మూడు - కాంగ్రెస్‌ ఐదు అసెంబ్లీ స్థానాల్లో ప్రాతినిధ్య వహిస్తున్నాయి. ఈ క్రమంలో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ అంత సులువు కాదని తెలుస్తోంది.