Begin typing your search above and press return to search.
కాషాయం అంటుకోలేదు కానీ..రంగులమయం!
By: Tupaki Desk | 20 May 2018 5:07 AM GMTకన్నడ రాజకీయాల ఉత్కంఠను సృష్టించి ఎట్టకేలకు శుభం కార్డు పడిన సంగతి తెలిసిందే. బీజేపీ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ఆరంభానికి ముందే ఆట ముగిసిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'కర్నాటకకు కాషాయ రంగు అంటుకోదు. కానీ రంగులమయ కొనసాగుతుంది..' అని ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారు. అలాగే ప్రజల కోసం నిలబడతాను... పోరాటం కొనసాగుతుందన్నారు. అంతకుముందు సైతం ఆయనో ఆసక్తికరమైన పంచ్ బీజేపీపై వేశారు. శనివారమే తమ బలాన్ని నిరూపించుకోవాలని సీఎం యడ్యూరప్పను సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో స్పందించారు. కర్ణాటక..బ్రేకింగ్ న్యూస్.. ప్రియమైన రాజకీయ నాయకుల్లారా.. రాష్ర్టాన్ని వెంటనే అభివృద్ధి చేసేయాలని తొందరపడకండి. ముందు మీరేంటో? మీ బలం ఎంతో? శనివారం సాయంత్రం 4 గంటలకు నిరూపించుకోండి. సుప్రీంకోర్టు సుప్రీంగా వ్యవహరించింది అని ట్విట్ చేశారు.
ఇదిలాఉండగా ఈ పరిణామాలు ప్రధాని మోడీ మెడకు చుట్టుకుంటున్నాయి. కర్నాటక పరిణామా లపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ధన బలానికి బదులు ప్రతిక్షాలు విజయం సాధించాయి. ప్రతి ఒక్కరిని కొనాలనుకునేవారు ఈ పరిణామాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని ట్వీట్ చేశారు. కర్నాటకలో మూడు రోజుల ముచ్చటైన యడ్యూరప్ప ప్రభుత్వం పడిపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానిస్తూ ఇది ప్రజాస్వామ్య - ప్రాంతీయ సమాఖ్య విజయమని వ్యాఖ్యానించారు. ''ప్రజాస్వామ్యం విజయం సాధించింది. కర్ణాటకకు అభినందనలు. దేవేగౌడకు - కుమారస్వామికి - కాంగ్రెస్ కు ఇతరులకు అభినందనలు' అంటూ ఆమె ట్వీట్ చేశారు.