Begin typing your search above and press return to search.

ప్ర‌ణ‌బ్ లాంటి జీవితం...ఎవ‌రూ కోరుకోరు!

By:  Tupaki Desk   |   31 Aug 2020 5:32 PM GMT
ప్ర‌ణ‌బ్ లాంటి జీవితం...ఎవ‌రూ కోరుకోరు!
X
`క‌ల‌లు క‌నండి. వాటిని సాకారం చేసుకునేందుకు శ్ర‌మించండి` ఈ మాట ఎవరిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే, మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ క‌న్నుమూసిన సంద‌ర్భంగా ఈ మాట‌ను గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే, ప్ర‌ణ‌బ్ జీవితం అలాంటిది. అలాంటి ఆలోచ‌న‌లు, ఆయ‌న కోరుకున్న‌టు వంటి, సాధించిన‌టువంటి జీవితం ఎంత మందికి సాధ్యం.

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన రాజ‌కీయ కుటుంబంలో ప్ర‌ణ‌బ్ జ‌న్మించారు. ముఖ‌ర్జీ త‌ల్లిదండ్రులు క‌మ‌దా కింక‌ర్ ముఖ‌ర్జీ, రాజ్య‌ల‌క్ష్మి ముఖ‌ర్జీ. దాదా తండ్రి క‌మ‌దా కింక‌ర్ ముఖ‌ర్జీ భార‌త స్వాతంత్ర ఉద్య‌మంలో చురుకుగా ప‌ని చేశారు. 1952 నుంచి 1964 మ‌ధ్య కాలంలో వెస్ట్ బెంగాల్ ఎమ్మెల్సీగా సేవ‌లందించారు. క‌ల‌క‌త్తా యూనివ‌ర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌, హిస్ట‌రీలో ఎంఏ డిగ్రీ ప‌ట్టా సాధించారు. అదే వ‌ర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ కూడా పూర్తి చేసి న్యాయ శాస్ర్తం ప‌ట్టా పుచ్చుకున్నారు. ఉన్న‌త విద్య పూర్త‌యిన త‌ర్వాత దాదాకు క‌లక‌త్తాలోని డిప్యూటీ అకౌంట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యంలో అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌గా ఉద్యోగం వ‌చ్చింది. 1963లో కోల్‌క‌తాలోని విద్యాన‌గ‌ర్ కాలేజీలో పొలిటిక‌ల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గా ప‌ని చేశారు. ఇదే స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టుగా ఆయ‌న ప‌నిచేశారు.

కాంగ్రెస్ పార్టీతో త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రణబ్‌ ముఖర్జీ అదే పార్టీలో కొన‌సాగి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారు. 1969లో మిడ్నాపూర్ ఉప ఎన్నిక‌ల వేళ‌ వీకే కృష్ణ‌మీన‌న్ త‌ర‌పున ప్ర‌ణ‌బ్ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్నారు. ప్ర‌ణ‌బ్ స‌త్తా గుర్తించిన ఇందిర ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించింది. 1969లో రాజ్య‌స‌భ‌కు ప్ర‌ణ‌బ్ తొలిసారి ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 1975, 1981, 1993, 1999 ఎన్నిక‌ల్లోనూ ప్ర‌ణ‌బ్ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కేంద్రంలో ఆయా ప్ర‌ధాన‌మంత్రుల వ‌ద్ద ప‌లుమార్లు కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు. ర‌క్ష‌ణ‌, ఆర్థిక‌, విదేశాంగ శాఖ మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. 1982–84 లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1980–85 లో రాజ్యసభ నాయకునిగా కొన‌సాగారు. 2009 నుంచి 2012 వ‌ర‌కు కేంద్ర ఆర్థిక మంత్రిగా సేవ‌లందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ చేతుల‌మీదుగా 2019లో భార‌త‌దేశ అత్యున్న‌త అవార్డు భార‌త‌ర‌త్న‌ను ప్ర‌ణ‌బ్‌ అందుకున్నారు.

ఇందిరా కుటుంబానికి, ముఖ్యంగా ఆమెకు న‌మ్మిన బంటుగా మారిన ప్ర‌ణ‌బ్‌కు 1973లో మంత్రి ప‌ద‌వి వ‌రించింది. 1976 –77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితిలో జరిగిన దురాగతాల విషయంలో కాంగ్రెస్ పార్టీలోను మిగతా కాంగ్రెసు నాయకుల వలెనే ముఖ‌ర్జీ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. కాగా, యూపీఏ-2 హ‌యాంలో రాహుల్ గాంధీ పార్టీలో క్రియాశీల‌కంగా మార‌డం దాదాకు న‌చ్చ‌లేదు. ఈ క్ర‌మంలో దాదాకు సోనియా రాష్ట్రపతి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌ణ‌బ్ శాశ్వ‌తంగా రాజ‌కీయాల‌కు దూరం అయ్యారు.

ప్ర‌ధానమంత్రి కావాల‌నేది ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కోరిక. అయితే, మూడుసార్లు ద‌గ్గ‌రికొచ్చిన‌ట్టే వ‌చ్చి ప్ర‌ధాని పీఠం చేజారింది. మొదటిది ఇందిర హత్యానంతరం, రెండోది రాజీవ్‌ హత్యానంతరం, మూడోది 2009లో మన్మోహన్‌సింగ్‌ రెండో టర్మ్‌ సమయంలో! ప్ర‌ధాని కావాల‌నే కోరిక ఉంద‌ని పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వానికి ప‌రోక్షంగా తెలియ‌జేసిన‌ప్ప‌టికీ.. అది చిర‌కాల వాంఛ‌గానే మిగిలిపోయింది. సోనియాగాంధీ మూలంగా ఆశ‌లు లేకుండా పోయాయి.

అయితే, ఆయ‌న మ‌రో కోరిక మాత్రం నెర‌వేరింది. 1969లో రాజ్యసభకు తొలిసారిగా ఎన్నికయిన‌ స‌మ‌యంలో రాష్ట్రపతి భవన్‌కు దగ్గరలోనే ముఖర్జీకి అధికారిక బంగ్లాను కేటాయించారు. ఈ క్రమంలో ఆయన ప్రతి రోజు రాష్ట్రపతి భవన్‌ను చూస్తూ నడక సాగించే వారు. భ‌వ‌న్‌లో ఉండే గుర్రపు బగ్గీని చూసి దాదా ముచ్చటపడేవారు. మరో జన్మంటూ ఉంటే.. గుర్రపు బగ్గీలో గుర్రాన్ని అయి పుడుతానని తన సోదరి అన్నపూర్ణతో ప్రణబ్‌ అనే వారు. ఆ మాటలు విన్న సోదరి.. అంత వరకు ఎందుకు.. ఈ జన్మలో తప్పకుండా రాష్ట్రపతి భవన్‌లో ఉండే అవకాశం వస్తుందన్నారట‌. ఆమె నాడు అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. 2012 నుంచి 2017 దాకా ప్రణబ్‌ రాష్ట్రపతిగా పని చేశారు. త‌న ముద్ర వేసుకున్నారు.

కాగా, పార్టీలకు అతీతంగా ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఆయ‌న ఎన్నో ద‌ఫాలుగా నిరూపించుకున్నారు. కరుడు కట్టిన కాంగ్రెస్‌ వాది అయినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకే చెల్లింది. 2018, జూన్‌ 7న నాగ్‌పూర్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యక్రమానికి ప్రణబ్‌ హాజరయ్యారు. అప్పట్లో అది పెను సంచలనం. కాకలు తీరిన రాజనీతిజ్ఞుడు, వ్యూహ చతురుడిగా పేరున్న దాదా.. ఆ కార్యక్రమంలో మాట్లాడిన తీరు రాజకీయ విశ్లేషకులనే తలలు పట్టుకునేలా చేసింది.