Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు కొత్త కింగ్ మేక‌ర్‌!

By:  Tupaki Desk   |   14 Oct 2017 5:30 PM GMT
కాంగ్రెస్‌ కు కొత్త కింగ్ మేక‌ర్‌!
X
దేశ అత్యున్న‌త ప‌ద‌విని చేపట్టిన త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌టం చాలామంది చేసేదే. అందులోకి రాష్ట్రప‌తి లాంటి ప‌ద‌విని చేప‌ట్టిన నేత‌.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే పాత్ర‌ను పోషించేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు.కానీ.. అందుకు భిన్నంగా ఇటీవ‌ల రాష్ట్రప‌తిగా ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన ప్ర‌ణ‌బ్ దా.. స‌రికొత్త‌గా రాజ‌కీయ తెర మీద‌కు రానున్నారా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది.

రాజ‌కీయ చాణుక్యుడిగా.. కాంగ్రెస్ పార్టీ మూలాల‌పై మాంచి ప‌ట్టున్న ప్ర‌ణ‌బ్ దాను తిరిగి కాంగ్రెస్ రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని పార్టీ భావించ‌ట‌మే కాదు.. అందుకు త‌గ్గ‌ట్లుగా మంత‌నాలు న‌డిపి.. చివ‌ర‌కు ఆయ‌న్ను ఒప్పించిన వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది. గ‌డిచిన కొద్దికాలంగా ప్ర‌ణ‌బ్ తో ప‌దే ప‌దే భేటీ అయిన సోనియా.. మ‌న్మోహ‌న్ లు.. ప్ర‌ణ‌బ్‌ ను కాంగ్రెస్‌ కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేలా చేయ‌ట‌మే కాదు.. కాంగ్రెస్ కింగ్ మేక‌ర్ బాధ్య‌త‌ల్ని ఆయ‌న స్వీక‌రించేందుకు ఓకే చేసేలా చేసింద‌ని చెబుతున్నారు.

రాష్ట్రప‌తి ప‌దవిని చేప‌ట్ట‌టానికి ముందు కాంగ్రెస్ లో కీల‌క బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించిన ప్ర‌ణ‌బ్‌.. తాజాగా మ‌రోసారి కీల‌కం కానున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. కాంగ్రెస్ కింగ్ మేక‌ర్ బాధ్య‌త‌ల్ని తీసుకునేందుకు ప్ర‌ణ‌బ్ ఓకే అన్నార‌టానికి నిద‌ర్శ‌నంగా తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్ని ప్ర‌స్తావిస్తున్నారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్ ను ఖాళీ చేసిన త‌ర్వాత 8 రాజాజీ మార్గ్ లో ప్ర‌ణ‌బ్ బ‌స చేశారు. ఆయ‌న నివాసానికి ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్ నేత‌ల తాకిడి ఎక్కువ కావ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్‌ లో ప్ర‌ణ‌బ్ కీల‌కంగా మారార‌ని చెప్ప‌టానికి ఇదో చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు.

ప్ర‌ణ‌బ్‌ కున్న అపార రాజ‌కీయ అనుభ‌వంతో కాంగ్రెస్ ను మ‌ళ్లీ అధికార‌పీఠానికి చేరుస్తార‌న్న న‌మ్మ‌కంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఉన్న‌ట్లు చెబుతున్నారు. తాజాగా ప్ర‌ణ‌బ్ ఆత్మ‌క‌థ మూడో పుస్త‌కాన్ని ఢిల్లీలో ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి రోటీన్ కు భిన్నంగా బీజేపీయేత‌ర నేత‌ల్ని మాత్ర‌మే ఆహ్వానించ‌టం ద్వారా.. బీజేపీ మీద ప్ర‌ణ‌బ్ దా స‌మ‌ర‌శంఖాన్ని పూరించిన విష‌యాన్ని ప‌రోక్షంగా చెప్పిన‌ట్లుగా భావిస్తున్నారు.

త‌న పుస్త‌కాన్ని రిలీజ్ చేసే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ఒక మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక‌ ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌టం.. అందులో కాంగ్రెస్‌ ను వెన‌కేసుకురావ‌టం గ‌మ‌నించాల్సిన అంశంగా చెప్పాలి. 132 ఏళ్ల కాంగ్రెస్‌ ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌ద‌ని.. పార్టీ మ‌ళ్లీ నిల‌బ‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు. నోట్ల ర‌ద్దుపై ప్ర‌జ‌ల్ని భ‌య‌పెట్ట‌కూడ‌ద‌న్న ప్ర‌ణ‌బ్ జీఎస్టీ విష‌యంలో మాత్రం మొద‌ట్లో కొన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. దాన్ని తానే షురూ చేసిన‌ట్లుగా చెప్పారు. ఏమైనా కాంగ్రెస్‌ కు స‌రికొత్త కింగ్ మేక‌ర్ వ‌చ్చేసిన‌ట్లుగా చెప్పాలి. మ‌రి.. వృద్ధ ప్ర‌ణ‌బ్ కు రాజ‌కీయ అనుభ‌వం ఎంత ఉన్నా.. ట‌క్కు ట‌మార విద్య‌ల్లో ఆరితేరిన మోడీ.. అమిత్ ల‌ను చెక్ పెట్టేయ‌గ‌ల‌రా? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.