Begin typing your search above and press return to search.

పెద్దాయనలో రాజకీయ వాసన పోలేదా?

By:  Tupaki Desk   |   18 Dec 2017 11:30 PM GMT
పెద్దాయనలో రాజకీయ వాసన పోలేదా?
X
భారతదేశానికే అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ పదవులంటే.. సాధారణంగా ఆ పదవులు అధిష్టించే వారికి.. అక్కడితో తమ పూర్వ రాజకీయ వాసనలు అన్నీ తొలిగపోతూ ఉంటాయి. మనం ప్రధానంగా రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి - గవర్నర్ పోస్టులను రాజ్యాంగబద్ధ - రాజకీయేతర పదవులుగా గుర్తిస్తూ ఉంటాం. వీటిలో గవర్నర్ గిరీ వెలగబెట్టిన తర్వాత.. మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. సీఎంలు అయిన వాళ్లు, కీలక స్థానాలు వెలగబెట్టిన వాళ్లు అనేకులు ఉన్నారు. అయితే.. దేశానికే అత్యున్నతం అయిన రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి వంటి పదవులు నిర్వహించిన తర్వాత తిరిగి మళ్లీ రాజకీయ వాసనలు అంటించుకున్న వారు మాత్రం మన ఎరికలో లేరు.

రాజకీయాల్లో ఉండగా.. వారికి పార్టీలతో ఉండే అనుబంధాలు, సంబంధ బాంధవ్యాలు ఎంత గాఢమైనవి అయినా కావొచ్చు గాక.. కానీ.. ఒకసారి ఈ అత్యున్నత పదవుల్లోకి వెళ్లే సందర్భంలో.. తమ రాజకీయ పార్టీ నేపథ్యాలకు రాజీనామా చేసేసిన తర్వాత.. సాధారణంగా అక్కడితే.. రాజకీయ అంకానికి పూర్తిగా తెరదించేస్తుంటారు. ఆ పదవి ముగిసిపోయిన తర్వాత కూడా.. నిర్వ్యాపారంగా.. మళ్లీ రాజకీయాలను ఒంటికి పులుముకోకుండా శేషజీవితం గడిపేస్తారే తప్ప.. వ్యవహారాల్లో కార్యక్రమాల్లో తలదూర్చరు. కానీ మొన్నటిదాకా దేశానికి అత్యున్నత స్థానంలో ఉన్న పెద్దాయన విషయంలో పరిస్థితి కాస్త తేడాగా కనిపిస్తోంది.

ప్రణబ్ ముఖర్జీ.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి ఉన్నత పదవులకైనా అర్హత కలిగి ఉన్న వ్యక్తిగా ఎంతో కాలంనుంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. ఒక దశలో తానే ఈ దేశానికి కాబోయే ప్రధానిని అని కూడా బలంగా నమ్మిన వ్యక్తి. అయితే ఆ అవకాశం కాకపోయినా.. తర్వాతి కాలంలో ఆయన ఏకంగా ప్రథమపౌరుడే అయ్యారు. రాష్ట్రపతి పదవిని నిర్వహించారు. సాధారణంగా పదవినుంచి దిగిపోయిన తర్వాత.. అందరూ రాజకీయాల జోలికి మళ్లీ రాకుండా, ఆ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించకుండా గడిపేస్తారు. కానీ ప్రణబ్ దాదా మాత్రం.. ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే కనిపిస్తున్నారు.

నిజానికి పదవినుంచి దిగిపోయిన తర్వాత.. ప్రణబ్ దాదా విడుదల చేసిన ఆత్మకథ పుస్తకంలోని సంగతులే.. అప్పట్లో రాజకీయ చర్చనీయాంశాలు అయ్యాయి. తాను ప్రధాని అయిఉండాల్సిందని.. ఆకాంక్షను ఆ సమయంలో ఆయన చాలా నిర్మొహమాటంగా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ బాగుకోసం తాను ఎప్పుడెప్పుడు ఎలాంటి సలహాలు ఇచ్చానో కూడా గుర్తు చేసుకున్నారు. అచ్చంగా పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కూడా సరిపోయేలా ఉన్న ఆ సూచనలు ఇప్పుడు సంక్షోభం నుంచి గట్టెక్కడానికే చెబుతున్నారా? అనిపించేలా.. ఆయన రచనలు సాగిపోయాయి. ఇంకా కీలక కాంగ్రెస్ నాయకుడిగా వ్యూహరచనల్లో భాగస్వామి అయ్యే తృష్ణ ఆయనలో తొలగిపోలేదా అనే చర్చలు కూడా నడిచాయి. ఆయన మాత్రం రాజకీయ వాసనలు వదులుకోవడం ఇష్టం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. సోనియాగాంధీకి పార్టీ నాయకత్వం నుంచి దిగిపోయిన తర్వాత.. వీడ్కోలు చెప్పడానికి ఏర్పాటుచేసిన విందులోనూ ఆయన కీలక అతిథే. మరి కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ విందులో లేరనే సంగతిని కూడా మనం గమనించాలి. ప్రణబ్ దాదా మళ్లీ ఎన్నికల బరిలోకి అడుగుపెట్టకపోవచ్చు.. కానీ.. రాజకీయ వాసనల్ని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడడం లేదని పలువురు భావిస్తున్నారు.