Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తి రేసులోకి ప్ర‌ణ‌బ్ రానున్నారా?

By:  Tupaki Desk   |   6 May 2017 6:24 AM GMT
రాష్ట్రప‌తి రేసులోకి ప్ర‌ణ‌బ్ రానున్నారా?
X
మ‌రికొద్ది నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి ఎన్నికకు సంబంధించి రోజుకో ఆస‌క్తిక‌ర వార్త‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. పాల‌క ఎన్డీయే నుంచి రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాని నేప‌థ్యంలో.. ఈ ఎన్నిక‌కు సంబంధించి చిత్ర‌మైన కాంబినేష‌న్ల‌పై త‌ర‌చూ జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా అలాంటి క‌థ‌న‌మే మ‌రొక‌టి వ‌చ్చింది.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌ణ‌బ్ దాను రెండోసారి బ‌రిలో నిలిపేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దేశ చ‌రిత్ర‌లో రాష్ట్రప‌తి గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన వారు ఎవ‌రూ (బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ మిన‌హా) కూడా రెండోసారి ప‌ద‌విని చేపట్టింది లేదు.. అదే స‌మ‌యంలో రాష్ట్రప‌తి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింది లేదు.

అయితే.. ప్ర‌స్తుతం రాష్ట్రప‌తిగా ఉన్న ప్ర‌ణ‌బ్ దాను కానీ త‌మ అభ్య‌ర్థిగా మోడీ స‌ర్కారు ఖ‌రారు చేస్తే.. తాము సైతం మ‌ద్ద‌తు ఇస్తామ‌ని కాంగ్రెస్ త‌న మాట‌గా చెప్పాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల అభ్య‌ర్థిని బ‌రిలోకి దించాల‌న్న ప్ర‌య‌త్నాన్ని కాంగ్రెస్ చేస్తోంది. ఇందుకోసం క‌స‌ర‌త్తు చేస్తోన్న ఆ పార్టీ ప్ర‌ణ‌బ్ ను బ‌రిలోకి తీసుకురావ‌టం ద్వారా మోడీ స‌ర్కారు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇదేమీ అంత తేలికైన విష‌యం కాద‌ని చెప్పాలి.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రెండోసారి బ‌రిలో నిల‌వ‌టానికి ముందు ప్ర‌ణ‌బ్ ఒప్పుకోవాల్సి ఉంది. ఇప్ప‌టికే ఆయ‌న‌.. త‌న‌కు రెండోసారి ప‌ద‌విని చేప‌ట్టే ఆలోచ‌న లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. ఆయ‌న మ‌రోసారి బ‌రిలోకి నిలుస్తారా? అన్న‌ది డౌటే. రాష్ట్రప‌తి ప‌ద‌విని చేప‌ట్ట‌క‌ముందు కాంగ్రెస్ పార్టీకే చెందిన ప్ర‌ణ‌బ్‌.. పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం.. త‌న‌కున్న వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకునే అవ‌కాశం లేద‌ని.. ఆయ‌న బ‌రిలో ఉండ‌రని అంటున్నారు. మ‌రోవైపు.. ప్ర‌ణ‌బ్ ను మ‌రోసారి రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా తెర‌పైకి తీసుకొచ్చే అవ‌కాశాల్ని కొట్టి పారేయ‌లేమ‌ని విప‌క్ష నేత‌లు చెబుతున్నారు. ఏమైనా.. ఈ త‌ర‌హా క‌థ‌నాల్ని ప్ర‌ణ‌బ్ స్వ‌యంగా తేల్చేస్తే మ‌రింత బాగుంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/