Begin typing your search above and press return to search.

ప్రధాని పీఠానికి ‘ప్రణబ్’ ఎలా దూరమయ్యాడో తెలుసా?

By:  Tupaki Desk   |   31 Aug 2020 5:00 PM GMT
ప్రధాని పీఠానికి ‘ప్రణబ్’ ఎలా దూరమయ్యాడో తెలుసా?
X
ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ‘ట్రబుల్ షూటర్’. ఏ సమస్య వచ్చినా ప్రణబ్ పరిష్కరించేవాడు. రెండు సార్లు ప్రధాని పదవికి చేరువై దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భీష్ముడిగా పేరొందిన ‘భారత రత్న’ ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనను రాజకీయ ప్రముఖులు, పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. నివాళులర్పిస్తున్నాయి.

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఈనెల 10న ఆస్పత్రిలో చేరిన 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించిన వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయనకు కరోనా పాజిటివ్ గా కూడా నిర్ణారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి తాజాగా సోమవారం సాయంత్రం మరింత విషమించి ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది.

*ప్రణబ్ ముఖర్జీ ప్రస్థానం..
పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలోని మిరాటీ గ్రామంలో 1935 డిసెంబర్ 11న ఆయన జన్మించారు. విద్యానగర్ కాలేజీలో ప్రొపెసర్ గా చేశారు. జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 1969లో ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ప్రణబ్ ముఖర్జీని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇందిరకు నమ్మిన బంటుగా.. కీలక సలహాదారుగా ప్రణబ్ మారారు. 1984లోనే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ‘యూరోమనీ మ్యాగజైన్’ గుర్తించింది.

కాంగ్రెస్ లో కీలక నేతగా.. ట్రబుల్ షూటర్ గా పేరొందారు. ప్రణబ్ ప్రధాని పదవి మినహా.. అత్యున్నత మంత్రి పదవుల్లో పనిచేశారు. 30 ఏళ్ల క్రితమే ఆర్థికమంత్రిగా పనిచేశారు. ప్రభావ శీల రాజకీయ నేతగా గుర్తింపుపొందాడు. 2012 జూలై 25న ప్రణబ్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇందిర మరణం తర్వాత ప్రణబ్ కు ప్రధాని పదవి ఒకసారి దగ్గరవరకు వచ్చి దూరమైంది.. రాజీవ్ మరణం తర్వాత కూడా ప్రధాని పీఠం మరో సారి చేరువైనా.. సీనియర్ అయిన పీవీ నర్సింహారావుకు ప్రధాని పదవి దక్కింది. ఇక యూపీఏ హయాంలో సోనియా ఈ సీనియర్ కు ఇవ్వాలని చూపినా.. మన్మోహన్ ను చేయడంతో నిరాశ చెందారు.

ఇక ప్రధాని పదవి దూరమైనా రాష్ట్రపతి పదవిని మాత్రం ఈ సీనియర్ గౌరవార్థం కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది. తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ కోసం యూపీఏ వేసిన కమిటీకి ఆయనే చైర్మన్. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతిగా సంతకం చేశారు. తెలంగాణ ప్రదాతగా.. కేసీఆర్ కు గాడ్ ఫాదర్ గా గుర్తింపు పొందాడు.