Begin typing your search above and press return to search.

బాబును.. ప్రణబ్ అంతలా పొగిడారా?

By:  Tupaki Desk   |   5 Aug 2016 5:08 AM GMT
బాబును.. ప్రణబ్ అంతలా పొగిడారా?
X
ప్రత్యేక హోదా అంశంపై ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిన వేళ.. త్వరలో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించటం.. హోదా అంశంపై మోడీతో భేటీ అయ్యేందుకు వీలుగా రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టటం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన చంద్రబాబు.. ఆయనతో కొంతసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్.. ముఖ్యమంత్రి చంద్రబాబును తెగ పొగిడేసినట్లుగా వస్తున్న వార్తలు కాస్త ఆసక్తికరంగా మారాయి.

అధికారికంగా జరిగిన కార్యక్రమంలో.. ఏపీ ముఖ్యమంత్రిని ప్రణబ్ దా పొగిడేసిన విషయాన్ని.. ‘తెలిసింది’.. ‘చెబుతున్నారు’ లాంటి పదాలతో భారీ పొగడ్త వార్తల్ని అచ్చేయటం గమనార్హం. ‘అందరూ మీలా పని చేస్తే చాలు.. దేశం అభివృద్ధిలో దూసుకెళుతుంది. మీరు ప్రతి అంశంలోనూ సానుకూల దృక్పథంతో ఉంటారు. రాజకీయ నాయకులు ఎన్నికల వేళ తప్ప మిగిలిన సమయంలో అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాలి’ అంటూ ప్రణబ్ దా చంద్రబాబును తెగ పొగిడేసినట్లుగా పేర్కొనటం గమనార్హం.

ఏపీ రాష్ట్ర సర్కారు నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించి.. తక్కువ సమయంలోనే పట్టిసీమ ప్రాజెక్టును బాగా పూర్తి చేశారంటూ పొగిడినట్లుగా సమాచారం అంటూ పేర్కొనటం గమనార్హం. చంద్రబాబుతో భేటీ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ దా.. దేశ ఆర్థిక వ్యవస్థ.. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులు.. ప్రపంచ రాజకీయ పరిస్థితులు.. అమెరికాకు కాబోయే అధ్యక్షులు లాంటి అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలిసిందంటూ సమాచారం బయటకు రావటం గమనార్హం.

అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ వ్యవహరించిన సమయంలో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాలనను ఆయన పొగడటం సామాన్యమైన విషయం కాదంటూ ప్రణబ్ దా.. చంద్రబాబును పొగిడేసినట్లుగా వార్తలు రావటం వింటే.. వామ్మో ఈ పొగడ్తలేందిరా బాబు అనుకోక మానరు. తాజా భేటీలో ఏపీ ఎంపీలు ఎవరైనా సరే.. తనను ఎప్పుడైనా కలవొచ్చని.. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడే తనను కలవాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా సమాచారం అంటూ అచ్చేసిన కథనాల్ని చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న అంశాల్ని ఏపీ సర్కారే ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేసిందన్న మాట వినిపిస్తోంది. సమకాలీన రాజకీయాల్లో రాష్ట్రపతిని ఒక ముఖ్యమంత్రికలిసిన నేపథ్యంలో.. సదరు సీఎంను రాష్ట్రపతి ఇంతలా పొగిడేసినట్లుగా వార్త రావటం ఇదే తొలిసారన్న మాట వినిపిస్తోంది. మరీ.. పొగడ్తల డోసు ఎక్కువైనట్లుగా ఉంది చంద్రబాబు.