Begin typing your search above and press return to search.

ఆసక్తికరంగా మారిన ప్రణబ్ దా ప్రసంగం

By:  Tupaki Desk   |   26 Jan 2017 4:56 AM GMT
ఆసక్తికరంగా మారిన ప్రణబ్ దా ప్రసంగం
X
ప్రతి ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని.. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తుంటారు. ఈ రోజులకు ఒక్క రోజు ముందే జాతిని ఉద్దేశించి ఆయన చేసే ప్రసంగాన్ని టీవీల్లోనూ.. రేడియోల్లోనూ ప్రసారం చేస్తుంటారు. దాదాపుగా ఈ ప్రసంగాలన్నీ ఒకేతీరులో ఉంటాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కొద్దిపాటి తేడాలు మినహా పెద్దగా మార్పులు ఉండదని.. ఈ ప్రసంగాలు చాలా రోటీన్ గా సాగుతాయన్నఅభిప్రాయం ఉంది.

అయితే.. ఈసారి ప్రసంగం అందుకు భిన్నంగా ఉందని చెప్పాలి. ఆసక్తికరమైన అంశాల్ని రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ దా తన ప్రసంగంలో ప్రస్తావించటం గమనార్హం. ఇటీవల కాలంలో జోరుగా చర్చకు వస్తున్న పార్లమెంటుకు.. అసెంబ్లీలకు ఓకేసారి ఎన్నికల మాటను రాష్ట్రపతి ప్రస్తావించటం విశేషంగా చెప్పాలి. ఈ ఆలోచన మంచిదని.. దీని అమలు కోసం ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని ప్రణబ్ దా సూచించారు.

కేంద్ర సర్కారు తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని పొగిడేసిన ఆయన.. దీని వల్ల తలెత్తే ఇబ్బందులు తాత్కాలికమేనని.. అవినీతి.. నల్లధనాన్ని అరికట్టే ప్రయత్నంలో తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్త చేశారు. వృద్ధి రేటు 7.2 శాతం ఉందని.. ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్నామని.. ద్రవ్యోల్బణం కూడా సౌకర్యవంతంగా ఉన్నట్లుగా ప్రణబ్ దా పేర్కొన్నారు.

అదే సమయంలో పార్లమెంటు.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగకుండా ఆందోళనలు.. నిరసనలతో సభ వాయిదా పడటం సరికాదన్న ఆయన.. అన్ని పార్టీలు సంయుక్త కృషితో అర్థవంతమైన చర్చ జరిపేలా చొరవ తీసుకోవాలన్నారు. రొటీన్ గా సాగుతుందనిపించేలా ఉండే రాష్ట్రపతి ప్రసంగం ఈసారి అందుకు భిన్నంగా కొన్ని కీలక అంశాల్ని ప్రస్తావించటం ఈసారి రిపబ్లిక్ డే స్పెషల్ గా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/