Begin typing your search above and press return to search.

చేసిన సూచన ఇద్దరు చంద్రుళ్లకేనా..?

By:  Tupaki Desk   |   4 July 2015 4:27 AM GMT
చేసిన సూచన ఇద్దరు చంద్రుళ్లకేనా..?
X
సీనియర్‌ బీజేపీ నేత.. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సీహెచ్‌ విద్యాసాగర్‌రావు రచించిన ''ఉనికి'' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లు హాజరైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా తాను ప్రత్యక్షంగా గమనిస్తున్న అంశాల్ని పెద్దమనిషి తరహాలో హితబోధ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. నిజానికి ఒక పుస్తక ఆవిష్కరణకు హాజరైన సందర్భంగా.. దానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడే కన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యసంబంధాలు ఎలా ఉండాలన్న అంశాన్ని ప్రస్తావించటాన్ని చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయన్న విషయం ప్రణబ్‌ మాటల్లో ఇట్టే అర్థమవుతంది.

ఇక.. ఆయన మాటల్ని పరిశీలిస్తే.. స్నేహితుల్ని ఎంపిక చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కానీ.. పొరుగువారిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండదని.. వారితో కలిసి సామరస్యంగా సాగటమే మనపైనే ఆధారపడి ఉంటుందన్న కీలక వ్యాఖ్య చేశారు. ఇక.. హైదరాబాద్‌ నగరం తెలంగాణ.. ఏపీలకు మాత్రమే కాదు దేశానికే ముఖ్యమైన నగరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ సాధన కోసం చేసిన ఉద్యమాన్ని ప్రస్తావించటమే కాదు.. దాన్ని సాధించిన వారికి శుభాకాంక్షలు చెప్పిన ప్రణబ్‌.. తెలంగాణతో తనకు మొదటి నుంచి సంబంధం ఉందన్న విషయాన్ని గుర్తు చేవారు. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య సామరస్యం ఉండాలని.. అందరం భారతదేశ పౌరులమేనని వ్యాఖ్యానించారు.

మామూలుగా చూసినప్పుడు ప్రణబ్‌ మాటలన్నీ కూడా.. ఇరు రాష్ట్రాలకు హితవు పలికినట్లుగా కనిపిస్తాయి. కానీ..కాస్త లోతుగా చూస్తే.. ప్రణబ్‌ చేసిన వ్యాఖ్యల్లో కొన్ని తెలంగాణ ముఖ్యమంత్రికి సూటిగా తగిలే వీలుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి విషయంలోనూ ఏదో విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరిని వివరంగా చెప్పటమే కాదు..తాను పలుమార్లు కలిసి కూర్చొని మాట్లాడుకుందామని ఆహ్వానించినా కేసీఆర్‌ పట్టించుకోలేదన్న మాటను ప్రణబ్‌తో ఏపీ ముఖ్యమంత్రి చెప్పటాన్ని మర్చిపోలేం.

ఈ కోణంలో చూసినప్పుడు.. ప్రణబ్‌ మాటల్లోని.. స్నేహితుల్ని ఎంపిక చేసుకోగలం కానీ.. పొరుగువారిని ఎంపిక చేసుకోలేమన్న మాట కేసీఆర్‌ను ఉద్దేశించి చెప్పిందనే భావన ఉంది. మరోవైపు.. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కాని నేపథ్యంలో.. ఈ మాటలన్నీ అక్కడే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసినట్లుగా భావించాలని చెబుతున్నారు. మొత్తంగా స్వయంగా రాష్ట్రపతే నోరు తెరిచి సంయమనంతో.. స్నేహపూర్వకంగా ఉండాలన్న మాటను చెప్పిన నేపథ్యంలో ఇరువురు చంద్రుళ్లు ఎలా స్పందిస్తారోచూడాలి.