Begin typing your search above and press return to search.
ఆర్ ఎస్ ఎస్ కు ఊపిరిపోస్తున్న కాంగ్రెస్ సీనియర్
By: Tupaki Desk | 26 Jun 2018 7:52 AM GMTరాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్. హిందుత్వ సిద్ధాంతాలతో సాగే బీజేపీకి మాతృక. ఈ వేదిక ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఉంది. ఇందుకు కారణం బీజేపీ నేతలు కాదు..కాంగ్రెస్ నాయకుడు! ఔను. నాగ్ పూర్ లోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఏడో తేదీన ఆరెస్సెస్ శిక్షా వర్గ్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరై ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగం తర్వాత తమ సంస్థకు ప్రజాదరణ పెరిగిందని ఆరెస్సెస్ సీనియర్ నేత బిప్లబ్ రాయ్ చెప్పారు. సంఘ్‌లో చేరేందుకు ఆసక్తులు చూపడమే ఇందుకు నిదర్శనం.
దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత - కాంగ్రెస్ లో నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల తర్వాత అంతటి ప్రభావం చూపే ఛరిష్మా కలిగిన నాయకుడు, రాజకీయ ప్రత్యర్థులు సైతం అజాతశత్రువుగా సంబోధించే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 7న నాగ్‌పూర్ లో జరిగే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల శిక్షణ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. మొదటినుంచీ కాంగ్రెస్ వాది అయిన ప్రణబ్ ముఖర్జీ.. ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమంలో ఏం మాట్లాడుతారోనని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందాయి. సమావేశానికి హాజరవడం ద్వారా మతసహనం అనే కీలక అంశంపై హితబోధ చేసేలా ప్రణబ్ మాట్లాడారు. అయితే, ప్రణబ్ తో రాక అనంతరం సంఘ్ పట్ల పలు వర్గాల నుంచి ఆసక్తి పెరిగింది. ఈ నెల ఆరో తేదీ వరకు జాతీయ స్థాయిలో రోజూ సగటున 378 మంది ఆరెస్సెస్ లో చేరతామని జాయిన్ ఆరెస్సెస్ వెబ్ సైట్ లో విజ్ఞప్తులు వచ్చేవని - ప్రణబ్ సందర్శించిన తర్వాత రోజూ సగటున 1200-1300 విజ్ఞప్తులు వస్తున్నాయని సంఘ్ నేత తెలిపారు. వాటిల్లో 40 శాతం బెంగాల్ నుంచేనని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఇదిలాఉండగా...కాంగ్రెస్ లో చాలామంది సీనియర్ నాయకులు అంతర్థానం అయిపోయినట్టు కాకుండా ప్రణబ్ స్వతంత్ర గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తేవడంలో ప్రణబ్ ముఖర్జీ కీలకపాత్ర పోషించనున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. 2019లో ఆయనే అత్యంత సమర్థవంతుడైన ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వస్తారని కొంతమంది నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు బెంగాల్ లో విస్తరించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ లు దీనిని తమకు సానుకూలంగా మల్చుకొని మరింతగా పుంజుకోవాలని భావిస్తున్నాయి.