Begin typing your search above and press return to search.
ప్రణబ్ తనయ సంచలన కామెంట్
By: Tupaki Desk | 10 Jun 2018 4:49 PM GMTమాజీ రాష్ట్రపతి - కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంలోకి అడుగుపెట్టడం తాలుకు పరిణామాలు... స్పందనల పరంపర ఇంకా కొనసాగుతోంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంఘ్ కార్యాలయంలో ప్రసంగించడంపై ఎన్నో విమర్శలు, ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. జీవితాంతం ఆరెస్సెస్‌ను ద్వేషించిన హార్డ్‌కోర్ కాంగ్రెస్ వ్యక్తి ప్రణబ్.. వాళ్ల దగ్గరికే వెళ్లడం ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి. అసలు ఈ విషయంలో కాంగ్రెసే రెండుగా చీలిపోయింది. మరోవైపు ప్రణబ్ కూతురు షర్మిష్ట ముఖర్జీ ఆయన సంఘ్ కార్యాలయానికి వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రణబ్ ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లడం షర్మిష్టకు ఇష్టం లేదు. ఆమె బహిరంగంగానే తన తండ్రి నిర్ణయాన్ని తప్పుబట్టారు. అనవసరంగా మీరే బీజేపీ చేతికి ఆయుధాన్ని ఇస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఆయన వెళ్లి వచ్చిన తర్వాత ఓ మార్ఫింగ్ ఫొటో చెక్కర్లు కొట్టడంపై కూడా ఆమె స్పందించారు. తాను భయపడినంత జరిగిందని, అందుకే అక్కడికి వెళ్లొద్దని మీకు చెప్పినట్లు షర్మిష్ట ప్రణబ్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు.
ఇలా తన తండ్రి జర్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న షర్మిష్ట తాజాగా మరో ఆసక్తికర కామెంట్ చేశారు. సంఘ్ కార్యాలయానికి ప్రణబ్ వెళ్లడం వెనుక 2019 లోక్‌సభ ఎన్నికల వ్యూహం ఉన్నదని శివసేన ఆరోపించిన విషయం తెలిసిందే. ఒకవేళ బీజేపీకి తగినన్ని సీట్లు రాకపోతే ప్రణబ్‌ను ప్రధాని పదవికి ప్రతిపాదించాలని ఆరెస్సెస్ భావిస్తున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 110 స్థానాలు కోల్పోవడం ఖాయమని, అందుకే ప్రణబ్‌ను పిలిచారని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేను కలిసిన కొన్ని రోజుల్లోనే ఆ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఈ వార్తలను ప్రణబ్ తనయ ఖండించారు. `మిస్టర్ రౌత్.. రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న తర్వాత మా నాన్న మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు` అంటూ ఆమె ట్వీట్ చేశారు. తద్వారా ఇప్పటివరకు జరుగుతున్న చర్చకు ప్రణబ్ తనయ చెక్ పెట్టారు.
మరోవైపు, 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని అడిగేందుకే ఉద్ధవ్‌ను అమిత్ షా కలిశారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. అయితే శివసేన మాత్రం ఈ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుపై తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఉద్ధవ్ స్పష్టం చేసినట్లు తెలిసింది.