Begin typing your search above and press return to search.

మారుతీరావు రిలీజ్..భారీ కాన్వాయ్‌ వెంటరాగా మిర్యాలగూడకు

By:  Tupaki Desk   |   28 April 2019 3:31 AM GMT
మారుతీరావు రిలీజ్..భారీ కాన్వాయ్‌ వెంటరాగా మిర్యాలగూడకు
X
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు - అమృత తండ్రి మారుతీరావు ఈ ఉదయం వరంగల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో హైకోర్టు నిందితులందరికీ శనివారం నాడు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, బెయిల్ పేపర్లు జైలు అధికారులకు అందడం ఆలస్యం కావడంతో మారుతీరావు విడుదల ఒక రోజు ఆలస్యమైంది. నిన్న రాత్రి బెయిల్ పత్రాలు జైలుకు అందడంతో - ఈ ఉదయం ఆయన విడుదలయ్యారు. మారుతీరావుతో పాటు శ్రవణ్‌ కుమార్ - కరీంలు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా, మారుతీరావుతో తనకు ప్రాణాపాయం ఉందని - భద్రత పెంచాలని అమృత పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

దాదాపు ఆరు నెలలకు పైగా జైలు జీవితాన్ని గడిపిన మారుతీరావుతో పాటు సహ నిందితులు కరీమ్ - శ్రవణ్ లు ఈ ఉదయం వరంగల్ జైలు నుంచి విడుదలైన సమయంలో అక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. మారుతీరావు జైలు నుంచి విడుదల కానున్నారని ముందే సమాచారం ఉండటంతో - మిర్యాలగూడకు చెందిన పలువురు వైశ్య వర్గం ప్రముఖులు ఆయన్ను చూసేందుకు జైలు వద్దకు వచ్చారు. వారితో పాటు మారుతీరావు కుటుంబ సభ్యులు కూడా జైలుకు చేరుకున్నారు. ఆయన జైలు నుంచి బయటకు రాగానే - ప్రత్యేక వాహనంలో ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. దాదాపు 20కి పైగా వాహనాలు ఆ వాహనం వెంట సాగాయి.

కాగా, మారుతీరావు తన కుమార్తె జోలికి పోరాదని - తనపై ఉన్న హత్య కేసులో సాక్ష్యాలను చెరిపేందుకు ప్రయత్నించరాదని - విదేశాలకు వెళ్లరాదని హైకోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. అయితే, తన తండ్రికి లభించిన బెయిల్ పై అమృత ఆవేదన వ్యక్తం చేసింది. నడిరోడ్డుపై పట్టపగలు హత్య చేయించిన వ్యక్తికి బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. తన తండ్రి బయటకు రావడంతో - తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తమకు సెక్యూరిటీని పెంచాలని జిల్లా ఎస్పీని కోరింది. బెయిల్ పై హైకోర్టులో అప్పీల్ చేస్తామని... అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.