Begin typing your search above and press return to search.

పొట్లూరి పొలిటిక‌ల్‌ ఫ్యూచ‌రేంటో?

By:  Tupaki Desk   |   16 Feb 2019 9:56 AM GMT
పొట్లూరి పొలిటిక‌ల్‌ ఫ్యూచ‌రేంటో?
X
పొట్లూరి వ‌ర ప్ర‌సాద్‌... పీవీపీగా తెలుగు నేల‌లో సుప్ర‌సిద్ధ వ్యాపార‌వేత్త‌గా ప‌రిచయం అక్క‌ర్లేని పేరే. వ్యాపార రంగంలో స‌క్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా త‌న‌దైన చ‌క్రం తిప్పుతున్న పీవీపీ.. రాజ‌కీయాల్లో మాత్రం ఆయ‌న క‌ల నెర‌వేరే అవ‌కాశాలు ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతూనే ఉన్నాయి. బిజినెస్ మాదిరిగానే పాలిటిక్స్‌లోనూ త‌న‌దైన ముద్ర వేసేందుకు పీవీపీ చాలా కాలం నుంచే త‌న‌కు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాల‌ను ప్రయోగిస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడ కూడా వ‌ర్క‌వుట్ కావ‌ట్లేదు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కాస్తంత గ‌ట్టిగానే య‌త్నించిన పీవీపీ... ఏకంగా త‌న తురుపు ముక్క‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూడా ప్ర‌యోగించారు. అయినా కూడా చివ‌రి నిమిషంలో కేశినేని నాని ఆ య‌త్నాన్ని కూడా భ‌గ్నం చేసేశారు.

మొత్తంగా నాడు ప‌వ‌న్ మాటే మంత్రంగా సాగిన చంద్ర‌బాబు కూడా పీవీపీ ఆశ‌యాన్ని నెర‌వేర్చేలేక‌పోయారు. అయితే ఈ సారైనా పీవీపీ ఆశ‌యం నెర‌వేరుతుందా? అంటే... డౌటేన‌న్న స‌మాధానం వ‌స్తోంది. పార్టీ ఏదైనా విజ‌య‌వాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా పార్ల‌మెంటులో అడుగుపెట్టాల‌న్న‌ది పీవీపీ జీవితాశ‌యం. అయితే టీడీపీ నుంచి ఈ ద‌ఫా సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని... త‌న స్థానాన్ని పీవీపీకే కాదు ఏ ఒక్క‌రికి కూడా త్యాగం చేసే అవ‌కాశాల్లేవు. ఈ క్ర‌మంలో వైసీపీ నుంచి న‌రుక్కొద్దామ‌ని భావించిన ఆయ‌న‌కు విజ‌య్ ఎల‌క్ట్రిక‌ల్స్ అధినేత దాస‌రి జై ర‌మేశ్ నుంచి మ‌రో ఆటంకం వ‌చ్చి చేరింది.

ఈ ద‌ఫా వైసీపీ టికెట్ జై ర‌మేశ్ కేన‌ని గ‌ట్టిగా వార్త‌లు వెలువడుతున్న నేప‌థ్యంలో పీవీపీకి అటు టీడీపీ నుంచే కాకుండా ఇటు వైసీపీ నుంచి కూడా దాదాపుగా డోర్స్ క్లోజేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక తన ఆప్త మిత్రుడైన ప‌వ‌న్ పార్టీ నుంచి పీవీపీకి టికెట్ ద‌క్కే అవ‌కాశాలున్నా... గెలుపుపైనే బోలెడ‌న్ని అనుమానాలు. ఎందుకంటే... క‌మ్మ సామాజిక వ‌ర్గం డామినేట్‌గా ఉన్న బెజ‌వాడ ఎంపీ సీట్లో... అన్ని పార్టీలు అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను బ‌రిలోకి దింపుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌న‌సేన త‌ర‌ఫున బ‌రిలోకి దిగితే... పీవీపీ గెలిచే ఛాన్స్ దాదాపుగా లేన‌ట్టే. వెర‌సి పీవీపీ ఎంపీ క‌ల... క‌ల‌గానే మిగిలిపోతుందా? అన్న వాద‌న వినిపిస్తోంది.