Begin typing your search above and press return to search.

ప్రసాదం.. విషతుల్యం.. 70 మందికి అస్వస్థత..!

By:  Tupaki Desk   |   12 March 2021 8:30 AM GMT
ప్రసాదం.. విషతుల్యం.. 70 మందికి అస్వస్థత..!
X
దేశం మొత్తం నిన్న మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. భక్తులు ఉపవాస దీక్షలు, జాగరణల్లో లీనమైపోయారు. శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో హోరెత్తాయి. భక్తులతో కిట కిట లాడాయి. ఇదిలా ఉంటే రాజస్థాన్​లో మాత్రం విషాదం చోటుచేసుకున్నది. ఓ ఆలయంలో ప్రసాదం తిన్న భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ప్రసాదం విషతుల్యమైనట్టు సమాచారం. దాదాపు 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఫుడ్​ పాయిజన్​ వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానిక అధికారులు అంటున్నారు.

రాజస్థాన్​లోని దుంగార్​పూర్​లో శివాలయంలో ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సారి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. పూజలు ముగిసిన వెంటనే ఆలయపూజారి భక్తులకు ప్రసాదం అందజేశారు. అయితే ఈ ప్రసాదం తిన్న దాదాపు 70 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఫుడ్​ పాయిజన్​ వల్లే భక్తులు అస్వస్థతకు గురయ్యారని.. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అస్వస్థతకు గురైన భక్తల నుంచి వైద్యులు షాంపిల్స్​ సేకరించారు.మరోవైపు రాజస్థాన్​ వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రా.. సీఎం అశోక్​ గెహ్లాట్​ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్​భవన్​లో, సీఎం క్యాంప్​ ఆఫీసులో ఘనంగా శివరాత్రి వేడుకలు నిర్వహించారు.