Begin typing your search above and press return to search.

చంద్ర ప్రసన్నం : బాబు ఈజ్ గ్రేట్ అంటున్న వైసీపీ ఎమ్మెల్యే...?

By:  Tupaki Desk   |   13 Jun 2022 4:30 PM GMT
చంద్ర ప్రసన్నం : బాబు ఈజ్ గ్రేట్ అంటున్న వైసీపీ ఎమ్మెల్యే...?
X
ఒక పార్టీలో ఉంటూ ప్రత్యర్ధి పార్టీలను పొగిడితే మాత్రం అది ఈ రోజులలో రాజకీయ సంచలనమే. గతంలో అయితే ఎవరు ఏ పార్టీలో ఉన్న మంచి ఎక్కడ జరిగినా అలాగే చూసేవారు. పొగిడేవారు. వారు కప్పదాట్లకు గోడ దూకుళ్లకు అతీతమైన వ్యక్తిత్వం కలిగిన వారు. ఇపుడు మాత్రం అలా లేదు. ఉన్న పార్టీకి మాత్రమే భజన చేయాలి. లేకపోతే తేడా వచ్చేస్తుంది. ఇక వేరే పార్టీ వారిని ఏ మాత్రం పొగిడినా లెక్కలు మారిపోతాయి. ఆయన మీద సవాలక్ష డౌటానుమానాలు వచ్చేస్తాయి.

ఇపుడు అదే జరుగుతోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్డి కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఆయన టీడీపీలో చేరి రెవిన్యూ శాఖా మంత్రి లాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. అదే పార్టీ నుంచి ఆ తరువాత రోజులలో బయటకు వెళ్లారు. మళ్ళీ కాంగ్రెస్ లో చేరి తన ఉనికి చాటుకున్నారు.

ఇదిలా ఉంటే నల్లపురెడ్డి వారసుడిగా 1990 దశకంలో రాజకీయాల్లో అడుగుపెట్టి ఫస్ట్ టైమ్ అసెంబ్లీ ముఖం చూడడానికి టీడీపీనే ఎంచుకున్నారు ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన తరువాత రోజుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లారు, అటు నుంచి వైసీపీలోకి వచ్చారు. ఇక ఆయన కోవూరు నుంచి గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తొలి విడత మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కలేదు.

నాటి నుంచే కొంత అసంతృప్తిగా ఉన్నా సరిపెట్టుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి మలివిడత విస్తరణ తరువాత మండిపాటు పడుతున్నారు. తనకు ఏ కోశానా అవకాశం లేకుండా పోయిందని కూడా భావిస్తున్నారు. దాంతో వైసీపీ హై కమాండ్ మీద ఆయన ఫైర్ అవుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కర్యక్రమంలో కూడా ఆయన పాలుపంచుకోలేదు. ఇటీవల పార్టీ వర్క్ షాప్ లో ఆ వివరాలను జగన్ బయటపెట్టారు.

ఇవన్నీ ఇలా ఉంటే ప్రసన్న తన అసంతృప్తిని సరైన వేదిక మీదనే బయటపెట్టారు అని అంటున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబుని పొగడడం తో వేదిక మీద ఉన్న వైసీపీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. ఇంతకీ ప్రసన్న ఏమన్నారు అంటే ఉప ఎన్నికలో పోటీ పెట్టనందుకు చంద్రబాబును అభినందించి తీరాలని. ఒక ఎమ్మెల్యే తన పదవీకాలంలో మరణిస్తే పోటీ పెట్టకూడదు అన్న టీడీపీ నియమం గొప్పదని, దానికి చంద్రబాబు కట్టుబడి ఉండడం గ్రేట్ అని కూడా అన్నారు. అందుకోసం చంద్రబాబుని అభినందించి తీరాలని కూడా ఆయన అనడమూ విశేషం.

అయితే సడెన్ గా ప్రసన్న చంద్రబాబును పొగడడం పట్ల వైసీపీ నాయకులు నిశ్చేష్టులే అయ్యారు. అంతే కాదు అదే వేదిక మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అయితే చంద్రబాబుని పొగడాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు. బాబు పోటీ అయితే పెట్టలేదని, తెర వెనక వైసీపీకి వ్యతిరేకంగా చేయాల్సిన కుట్రలు అన్నీ చేస్తునే ఉన్నారని ప్రసన్నకు రిటార్ట్ ఇచ్చారు. మొత్తానికి ప్రసన్న వ్యాఖ్యలు అయితే వైసీపీలో మంటలు రేపుతున్నాయి.

ఆయన వైఖరి చూస్తే టీడీపీ వైపు చూస్తున్నారా అందులో భాగంగానే బాబుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ డైలాగ్ వేశారా అన్న చర్చ అయితే వస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్రసన్న అయితే మాత్రం వైసీపీ పట్ల ఏ మాత్రం ప్రసన్నంగా లేరు, అదే సమయంలో చంద్రబాబు పట్ల ప్రసన్నంగా ఉంటున్నారు. గతంలో ఇదే ప్రసన్న చంద్రబాబుని నానా మాటలు అన్న వారే. మరి ఆయనలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అంటే ఆలోచించాలి.