Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి మాటలకి వినయంగా కౌంటర్ ఇచ్చిన పీకే!

By:  Tupaki Desk   |   28 Dec 2019 3:14 PM GMT
కేంద్ర మంత్రి మాటలకి వినయంగా కౌంటర్ ఇచ్చిన పీకే!
X
ఎన్నికల వ్యూహకర్త , జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ ఎవరో తనకి తెలియదు అని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్‌ సింగ్‌ పూరి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రశాంత్‌ కిషోర్‌ స్పందించారు. తన లాంటి సామాన్యుల గురించి ఉన్నత పదవిలో ఉన్న మంత్రికి తెలియకపోవడం సాధారణ విషయమే అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేం‍ద్ర మోదీ ప్రధానిగా గెలుపొందడం, నితీష్‌ కుమార్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా పలు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు సైతం ప్రశాంత్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి విజయాలు అందించారు. దీంతో ఆయన పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది.

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా పీకే బృందంతో జట్టుకట్టారు. దీంతో కిషోర్‌ నేత్వంలోని ఐపాక్‌ టీం తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కో- ఇంచార్జిగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి హర్దీప్‌ పూరి ప్రశాంత్‌ కిషోర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు ప్రశాంత్‌ కిషోర్‌ ఎవరు అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో పీకే కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు . ఆయనో సీనియర్ మంత్రి. నాలాంటి సామాన్యుడి గురించి ఆయనకు తెలియాలని ఏముంది? నాలాగే యూపీ, బీహార్‌ల నుంచి లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి బతుకుపోరు సాగిస్తున్నారు. వారి గురించి పూరి లాంటి సీనియర్ నేతకు ఎలా తెలుస్తుంది అంటూ పీకే మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే , దీనిపై నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు. అవసరం ఉన్నపుడు అతడి సేవలు వినియోగించుకుని.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ తరఫున అతడు ప్రచారంలోకి దిగగానే ఎవరని ప్రశ్నిస్తారా? కనీసం ఎన్డీయేలో భాగస్వామ్యమైన జేడీయూ ఉపాధ్యక్షుడని కూడా తెలియకపోవడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు.