Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వెంటే జ‌న‌మంతా: ప్ర‌శాంత్ కిశోర్‌

By:  Tupaki Desk   |   5 July 2017 3:40 PM GMT
జ‌గ‌న్ వెంటే జ‌న‌మంతా: ప్ర‌శాంత్ కిశోర్‌
X
రాజ‌కీయ విశ్లేష‌ణ‌కుడు.. పోల్ మేనేజ్ మెంట్ నిపుణుడు ప్ర‌శాంత్ కిశోర్ ఏపీ రాజ‌కీయాల మీద దృష్టి సారించిన విష‌యం తెలిసిందే. గ‌డిచిన కొద్దికాలంగా ఏపీ రాజ‌కీయాల్ని నిశితంగా గ‌మ‌నిస్తున్న ఆయ‌న‌.. తాజాగా త‌న ఫ‌స్ట్ రిపోర్ట్‌ ను ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు తెలియ‌జేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌తో స‌హా.. జిల్లా పార్టీ అధ్య‌క్షుల‌తో పాటు కీల‌క నేత‌లంద‌రితోనూ ఏపీ తాజా రాజ‌కీయ అంశాలు.. ప్ర‌జ‌ల మ‌నోభావాలు.. రాష్ట్ర రాజ‌కీయాల‌పై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? రానున్న రోజుల్లో రాజ‌కీయ ప‌రిస్థితి ఏ విధంగా ఉండ‌నుంది? లాంటి అంశాల‌పై ఆయ‌న త‌న అభిప్రాయాల్ని వెల్ల‌డించారు. పార్టీ నేత‌ల‌తో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్.. ఏపీ రాష్ట్ర రాజ‌కీయాల‌కు సంబంధించి కీల‌క అంశాల్ని ప్ర‌స్తావించారు.

ప్ర‌స్తుతం ఏపీ అధికార‌ప‌క్షం మీద ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని చెప్పారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌టంలో ఏపీ అధికార‌ప‌క్షం ఘోరంగా విఫ‌లం కావ‌టంపై ఆగ్ర‌హంగా ఉంద‌న్నారు. విభ‌జ‌న నేప‌థ్యంలో చంద్ర‌బాబు అనుభ‌వం వైపు కాస్తంత మొగ్గిన ఏపీ ఓట‌ర్లు.. తాము పెద్ద త‌ప్పే చేసిన‌ట్లుగా ఫీల‌వుతున్న‌ట్లుగా చెప్పారు. త‌మ ఆశ‌ల్ని చంద్ర‌బాబు వ‌మ్ము చేశార‌ని వారు భావిస్తున్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

తమ బృందం ఏపీ రాజ‌కీయాల‌పై నిశితంగా దృష్టి సారించింద‌ని.. చంద్ర‌బాబు స‌ర్కారుపైనా.. సీఎం చంద్ర‌బాబు పాల‌న మీద ప‌ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని చెప్పారు.

ఏపీలో పెరిగిపోయిన అవినీతి.. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ఏమీ లేక‌పోవటం.. అధికార‌ప‌క్ష నేత‌ల దందా అంత‌కంత‌కూ పెరిగిపోయింద‌న్న భావ‌న‌లో ఏపీ ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు చెప్పారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు న‌డిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ స్వీప్ చేస్తుంద‌ని చెప్పారు. జ‌గ‌న్ వెంట‌నే ఏపీ ప్ర‌జ‌లు ఉన్నార‌న్న విష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌లంతా ముక్త‌కంఠంతో చెబుతున్నార‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అధికార‌పార్టీ ఎమ్మెల్యేల అవినీతి అంత‌కంత‌కూ పెరిగిపోతోంద‌ని..ఈ విష‌యంపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా చెప్పారు.

విభ‌జ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోగా.. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేక‌పోవ‌టంపైనా ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్న‌ట్లు చెప్పారు. పాల‌నా ప‌రంగా చంద్ర‌బాబు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌న్న భావ‌న‌లో ఏపీ ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ అసంతృప్తి రోజులు గ‌డుస్తున్న కొద్దీ అంత‌కంత‌కూ పెరుగుతుంద‌ని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో తాము నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నుంచి బూత్ స్థాయి మీద దృష్టి సారిస్తామ‌ని.. ప్ర‌జాభిప్రాయాన్ని క్రోడీక‌రించి పార్టీ నేత‌ల‌కు చెబుతామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జిల మార్పు అవ‌స‌రం లేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. రానున్న ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో మ‌రింత లోతుగా ఏపీ రాజ‌కీయాల్ని విశ్లేషించే ప‌నిలో తాము ఉన్న‌ట్లు చెప్పారు. ప్ర‌శాంత్ కిశోర్ మాట‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.