Begin typing your search above and press return to search.

నిలకడలేని నితీష్...ఫెవికాల్ బ్రాండ్ అంబాసిడర్

By:  Tupaki Desk   |   11 Sep 2022 12:18 PM GMT
నిలకడలేని నితీష్...ఫెవికాల్  బ్రాండ్ అంబాసిడర్
X
బీహార్ సీఎం గా ఉన్న నితీష్ కుమార్ మీద ఒక రేంజిలో ఎన్నిక వ్యూహకర్త కమ్ రాజకీయ నాయకుడు అయిన ప్రశాంత్ కిశోర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిలకడలేని నాయకుడని, కుర్చీ కోసం ఏమైనా చేస్తారని జేడీయూకు హీటెక్కించే మాటలనే వదిలారు. నితీష్ కుమార్ బీహార్ సీఎం గా పదేళ్ల కాలంలో ఎనిమిది సార్లు ప్రమాణం చేశారంటేనే ఆయన వల్ల అక్కడ రాజకీయ అస్థిరత ఏ స్థాయిలో అక్కడ ఉందో అర్ధమవుతోందో అని పీకే కొత్త డౌట్ పెట్టేశారు.

నితీష్ కుమార్ తన కుర్చీని కాపాడుకోవడానికి ఏ పార్టీతోనే పొత్తులకు సై. అదే టైం లో వీలు కాకపోతే పొత్తులు తెంచుకోవడానికైనా సై అని ఏకి పారేశారు. ఆయన సీఎం కుర్చీకి ఫెవికాల్ తగిలించేసుకున్నారని సెటైర్లు వేశారు. ఆయన్ని ఫెవికాల్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటిస్తే బాగుంటుంది కానీ విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా చేయనే కూడదని పీకే సలహ ఇచ్చారు.

ఆయనకు విశ్వసనీయత లేదని, అధికారమే పరమావధి అనుకునే రకమైని కూడా పీకే నిప్పులు చెరిగారు. ఇక దేశంలో చూస్తే బీజేపీ బలంగా ఉందని, అంతటి బలంగా ఉన్న పార్టీని ఢీ కొట్టాలంటే బలమైన విపక్ష కూటమి తయారు కావాలని పీకే సలహా ఇచ్చారు. అంతే కాదు, నితీష్ లాంటి వారిని ముందు పెట్టుకుని వెళ్తే అసలుకే ఎసరు వస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

నితీష్ కంటే విపక్ష కూటమికి మమతా బెనర్జీ అయినా, కేసీయార్ అయినా కేజ్రీవాల్ అయినా బెటర్ గా ఉంటుందని కూడా పీకే చెప్పడం విశేషం. ఏవో ఢిల్లీకి వెళ్లి వచ్చామని, నలుగురు నాయకులను కలసి టీ తాగామని నితీష్ అనుకుంటే బీజేపీ పని ఏమీ అవదని, దేశంలో విపక్ష కూటమికి అది ఏ మాత్రం ఉపయోగపడదని కూడా పీకే చెప్పుకొచ్చారు.

ఇక నితీష్ కుమార్ అందరినీ కలుపుకుని వెళ్ళే నేచర్ ఉన్న వారు కాదని, ఆమోదయోగ్యుడు అంతకంటే కారని ఆయన్ని పీకే తీసి పక్కన పెట్టేశారు. ఆయన రాజకీయ స్వార్ధం కుర్చీ కోసం ఆరాటమే విపక్ష ఫ్రంట్ కి ఇబ్బందిగా మారుతుంది అని అన్నారు. ఇక నితీష్ ప్రస్తుతం ఆర్జేడీ కూటమితో ఉన్నారని, ఈ కూటమి ఎన్నాళ్ళు అధికారంలో ఉంటుందో ఎవరికీ తెలియదు అని పీకే జోస్యం చెప్పేశారు.

ఇక నితీష్ మీద బీహార్ లో ఆయన పాలన మీద అక్కడి ప్రజలకే నమ్మకం లేనపుడు దేశంలో ప్రజలకు ఎలా ఉంటుందని లా పాయింట్ ని తీశారు పీకే. మొత్తానికి జోస్యాలు చెబుతూ సర్వేలు చేస్తూ దేశంలో చాలా పార్టీలను గద్దెను ఎక్కించిన పీకే కూడా నితీష్ కి ఒకనాడు సహచరుడే. సన్నిహితుడే. జేడీయూ కి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న పీకే బీజేపీ విధానాలు కొన్ని వ్యతిరేకించారు. నాడు ఎన్డీయేలో ఉన్న నితీష్ కి అవి రుచించక ఆయన్ని పార్టీ నుంచి పంపేశారు.

ఇపుడు అదే ఎన్డీయే నుంచి నితీష్ బయటకు వచ్చేశారు. అయితే తనను నాడు బయటకు పంపిన నితీష్ మీద పీకేకు కోపం అలాగే ఉంది. అందుకే ఆయన బీహార్ లో కొత్త పార్టీ పెట్టి పవర్ లోకి రావాలని చూస్తున్నారు. నితీష్ ని బీహార్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పించాలన్నదే ఆయన రాజకీయ ఎత్తుగడ. అందుకే ఆయన మీద ఏ పార్టీ నాయకుడు కూడా చేయని విమర్శలు పీకే చేస్తున్నారు అని అంటున్నారు.