Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఆశ; ఆ మాటతో మేజిక్ జరుగుతుందట

By:  Tupaki Desk   |   15 July 2016 9:06 AM GMT
కాంగ్రెస్ ఆశ; ఆ మాటతో మేజిక్ జరుగుతుందట
X
భావోద్వేగాలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అనుభూతి కోసం మాటలకు మించిన మాధ్యమం మరొకటి లేదు. అందుకే ఈ రెండింటిపైనా కాంగ్రెస్ పార్టీ బోలెడంత నమ్మకం పెట్టుకొని ఒక పెద్ద యుద్ధానికి సన్నద్ధమవుతోంది. వరుస పరాజయాలతో చిక్కి.. శల్యమైన కాంగ్రెస్ తన పూర్వవైభవం కోసం.. పోల్ మేనేజ్ మెంట్ లో మొనగాడిగా పేరున్న ప్రశాంత్ కిశోర్ ను అద్దెకు తెచ్చుకోవటం తెలిసిందే. యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్న ఆయన.. తన మేజిక్ ను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు.

ఢిల్లీ రాష్ట్రానికి ముచ్చటగా మూడుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టి.. ఢిల్లీ ప్రజల ఛీత్కారంతో నాలుగోసారి పార్టీనే కాదు.. చివరకు తాను సైతం ఎమ్మెల్యేగా గెలవలేని 80వ పడిలో ఉన్న షీలాదీక్షిత్ ను దేశంలోనే అతి పెద్దదైన రాష్ట్రమైన యూపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూస్తూ.. చూస్తూ షీలాదీక్షిత్ ను నమ్ముకోవటం ఏమిటి? ఆమె లాంటి నేతకు యూపీ ప్రజలు ఓట్లు వేస్తారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్న వేళ.. తన జాదూతనాన్ని బయటపెట్టాడు ప్రశాంత్ భూషణ్. ఒక్క నినాదంతో యూపీ ప్రజలకు హాలీవుడ్ సినిమా చూపించాలన్న లక్ష్యంతోనే షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది.

యూపీ ప్రజల్లో భావోద్వేగాన్ని టచ్ చేసే మాటతో పాటు.. అందుకు తగిన వ్యక్తి షీలా దీక్షిత్ కావటంతో ఆమెను ఎంపిక వెనుక అసలు విషయం అర్థమయ్యే పరిస్థితి. ఇంతకీ ప్రశాంత్ కిశోర్ తయారు చేసిన తొలి స్లోగన్ ను చూస్తే.. అప్రయత్నంగా అయినా ‘‘వావ్’’ అని అనాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి గెలుపే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు కనిపించక మానదు.

ఇంతకీ.. అతగాడు తయారు చేసిన స్లోగన్ చూస్తే.. ‘‘మేరీ జీవన్ కా ఏక్ హీ సప్నా.. ఉత్తరప్రదేశ్ కో దిల్లీ జైసా బనానా’’ అన్న నినాదంతో అదరగొట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఆ హిందీ స్లోగన్ ను అచ్చ తెలుగులో చెబితే.. ‘‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఢిల్లీలా మార్చాలన్నదే నా జీవితంలోని ఆఖరి కోరిక’’ అని చెప్పాలి. షీలమ్మ వయసులో సగం కూడా లేని ప్రశాంత్ కిశోర్ తయారు చేసిన ఈ స్లోగన్ తో బ్రాహ్మణ ఓటర్లను సమీకరించటం.. ఒక్కటిగా చేయటంతో పాటు.. ఓబీసీగా ఉన్న రాజ్ బబ్బర్ తో ఆ వర్గాన్ని కూడగట్టటంతో పాటు.. ముస్లింల మనసును దోచుకోవటంతో యూపీలో గెలుపు పాగా వేయాలన్నదే ప్రశాంత్ కిశోర్ లక్ష్యంగా చెబుతున్నారు. మరి.. అతగాడి స్లోగన్ వ్యూహం వర్క్ వుట్ అవుతుందా? అన్నది చూడాలి.