Begin typing your search above and press return to search.

పీకే రెమ్యునరేషన్ అధికారికంగా బయటకొచ్చేసింది

By:  Tupaki Desk   |   17 Nov 2019 11:05 AM GMT
పీకే రెమ్యునరేషన్ అధికారికంగా బయటకొచ్చేసింది
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ షార్ట్ కట్ లో పీకేను నియమించుకోవటం తెలిసిందే. ఎన్నికల వేళ వ్యూహాలు పన్నటంలో పీకేకు చక్కటి ట్రాక్ రికార్డు ఉందన్న విషయం తెలిసిందే. వ్యూహకర్తగా నియమించుకోవటమే కాదు.. ఆయన చెప్పినట్లే తూచా తప్పకుండా అమలు చేసిన విషయంలోనూ జగన్ ను మెచ్చుకోవాలి.

ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలోనూ పీకే టీం ఇచ్చిన సలహాల్ని జగన్ పాటించారన్న మాటను చెబుతుంటారు. మూడు దశల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగా వచ్చిన రిపోర్టులకు తగ్గట్లే వ్యూహాల్ని సిద్ధం చేయటంతోపాటు.. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో పక్కాగా అమలు చేశారని చెప్పాలి. ఇదే జగన్ కు 151 సీట్లు దక్కటంలో కీలకభూమిక పోషించినట్లు చెప్పాలి.

ఏపీలో జగన్ పార్టీ అధికారంలోకి రావటానికి జగన్ ఛరిష్మా ఎంతలా పని చేసిందో.. పీకే వ్యూహాలు.. సలహాలు.. సూచనలు కూడా అంతే ప్రభావాన్ని చూపాయన్న మాటను ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సైతం ఒప్పుకుంటరు. ఇంతకూ పీకే ఎంత ఛార్జ్ చేశారు? జగన్ పార్టీ ఆయనకు ఎంత మొత్తాన్ని రెమ్యునరేషన్ రూపంలో చెల్లించింది? అన్న విషయంపై చాలానే ఊహాగానాలు వచ్చినా.. అధికారిక లెక్కలు బయటకు రాలేదు. తాజాగా ఆ విషయం రివీల్ అయ్యింది.

పీకే పెట్టిన పొలిటికల్ కన్సల్టెన్సీ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (పొట్టి చేసి చెప్పాలంటే ఐపాక్)కి జగన్ పార్టీ చెల్లించిన మొత్తానికి సంబంధించిన లెక్కను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా వెల్లడించింది. తన ఎన్నికల వ్యయ ప్రకటనను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన పార్టీ ప్రశాంత్ కిషోర్ సంస్థకు రూ.37.57 కోట్ల మొత్తాన్ని చెల్లించినట్లుగా పేర్కొంది. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పూర్తి అయ్యాక.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న బోర్డును బహుకరించి సెలవు తీసుకోవటం తెలిసిందే. అప్పట్లో ఆ నేమ్ ప్లేట్ వైరల్ గా మారింది.