Begin typing your search above and press return to search.

మిస్ట‌ర్ ప్ర‌శాంత్ కిశోర్‌.. ఏపీని ఆదుకోండి.. నీ చెత్త స‌ల‌హాల వ‌ల‌న‌..

By:  Tupaki Desk   |   15 Dec 2021 11:30 PM GMT
మిస్ట‌ర్ ప్ర‌శాంత్ కిశోర్‌.. ఏపీని ఆదుకోండి.. నీ చెత్త స‌ల‌హాల వ‌ల‌న‌..
X
ఏపీ ఇప్పుడు ఎలా ఉంది? అని ఏ ఇద్ద‌రు కలుసుకుని మాట్లాడినా.. పెద‌వి విరుపు మాట‌లే వినిపిస్తున్నాయి. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఏపీ ప‌రువు పోయేలా ఈ చ‌ర్చ సాగుతోంది. ఏపీ ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్త‌వ‌మే.. దీనికి ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ లేక‌పోవ‌డం.. అమ్మ ఒడి వంటి ఉచిత ప‌థ‌కాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డ‌మే కార‌ణ‌మ‌ని.. కేంద్రం కూడా దుమ్మెత్తి పోసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, ఏపీకి చెందిన అధికార పార్టీ ఎంపీలు కూడా అయ్యామాకు సాయం చేయండి .. అని ఢిల్లీలో చేతులు రెండూ ఎత్తి కేంద్రానికి మొక్కుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి.

ఉద్యోగుల‌కు నెల నెలా జీతాలు ఇచ్చేందుకు.. కూడా ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆర్థిక ప‌రిస్థితి అస్త‌వ్య‌స్తంగా మారిపోయింద‌నే ఆందోళ‌న అన్ని వ‌ర్గాల్లోనూ వినిపిస్తోంది. మ‌రి దీనికి కార‌ణం ఎవ‌రు? ఏంటి? అంటే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ అధికారంలోకి రావ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా ఆ పార్టీని.. ఆపార్టీ అధినేత జ‌గ‌న్‌ను ముందుకు న‌డిపించిన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. జ‌గ‌న్‌కు స‌ల‌హాదారు.. ప్ర‌శాంత్ కిశోరేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పీకే కార‌ణంగానే..రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలైంద‌ని.. కేవ‌లం పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు అలివి కాని హామీలు.. ఉచితాలు ప్ర‌క‌టించేలా వ్యూహాలు ర‌చించి.. ఇప్పుడు రాష్ట్రం నెత్తిన ఆర్థిక భారం పెరిగేలా చేశార‌ని అంటున్నారు.

పీకే.. రాజ‌కీయ వ్యూహం ఒక్క‌టే.. ఆయ‌న ఎంత‌సేపూ.. తన‌కు డ‌బ్బులు ఇచ్చి.. నియ‌మించుకున్న పార్టీని ఎలా గెలిపించాలి.. ఓట్ల‌ను ఎలా చీల్చాలి.. పార్టీల మ‌ధ్య ఎలా చిచ్చు పెట్టాలి.. కులాల మ‌ధ్య ఎలా కుంప‌ట్లు రాజేయాలి.. అనే ఆలోచ‌న చేస్తాడ‌నే పేరుంది. అంతేకాదు.. ఉచితాలు, ఉచిత హామీలు ఇవ్వ‌డం.. ఓట్ల‌ను ఎలా కొల్ల‌గొట్టాల‌నే విధానం.. స్థానిక నేత‌ల‌కు ఎలా అబ‌ద్దాలు ఆడాలి.. అనే విష‌యాల‌పై త‌ర్ఫీదు ఇవ్వ‌డం.. ప‌ని! అంతేకాదు.. ప‌క్క పార్టీల నుంచి నేత‌ల‌ను ఎలా జంపింగుల‌కు ప్రోత్స‌హించాల‌ని.. మంచి వాళ్ల‌ను కూడా ఎలా లాగాలి.. అనేది త‌ప్ప‌.. పీకేకు మ‌రో ఆలోచ‌న లేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అంతేత‌ప్ప‌..పీకేకు.. దేశ‌, రాష్ట్రాల మీద ప్రేమ కానీ.. బాధ్య‌త‌కానీ.. భ‌విష్య‌త్తు గురించి కానీ.. ఆర్థికంగా ఆయా రాష్ట్రాలు.. ఎలా ఎద‌గాల‌నే విష‌యంపై అవ‌గాహ‌న లేక‌పోగా.. వాటిని ఆయ‌న అస్సులు ప‌ట్టించుకునే ప‌రిస్థితి కూడా లేదు. మ‌రీ ముఖ్యంగా ఏ రాష్ట్రానికైనా పెట్టుబ‌డులే వ‌రం. అవి వ‌స్తేనే ఉపాధి, ఉద్యోగాలు పెరుగుతాయి. రాష్ట్రాల‌కు ఆర్థికంగా ఊతం ల‌భిస్తుంది. అయితే.. పీకే మాత్రం పెట్టుబ‌డులు ఎలా ర‌ప్పించాల‌నే విష‌యం ఏనాడు ప‌ట్టించుకోలేదు. నిజానికి ఆయ‌న ఇలా ఆలోచన చేసి ఉంటే.. ఏపీ ప‌రిస్థితి నేడు ఇలా ఇంత దారుణంగా ఉండేది కాద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

పీకే ఇచ్చిన చెత్త స‌ల‌హాల కార‌ణంగా..ఏపీ అప్పులలో కూరుకుపోయింది. ఇంకా అప్పులు పెరిగిపోయే ప‌రిస్థితికి చేరుకుంది. అని మేదావులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇలాంటి చెత్త స‌ల‌హాలు ఇస్తే.. దేశ ప‌రిస్థితి దిగ‌జారి పోతుంద‌ని.. భావించే గ‌తంలో పీకే స‌ల‌హాలు తీసుకున్న కేంద్రంలోని బీజేపీ కూడా.. ప‌క్క‌న పెట్టింద‌నే టాక్ వినిపిస్తుంది. అందుకే.. జాతీయ పార్టీలు ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదేని.. కేవలం.. ప్రాంతీయ పార్టీలను ఎంచుకుని.. లోక‌ల్ బ‌డ్జెట్ చూసుకోకుండా.. ఓట్ల కోసం.. స్తానిక‌, ప్రాంతీయ పార్టీల‌ను గెలిపించ‌డం కోసం.. పిచ్చి పిచ్చి చెత్త స‌ల‌హాలు ఇచ్చాడ‌ని అంటున్నారు. తర్వాత‌.. త‌న చేతులు దులుపుకొని.. బోన‌స్ తీసుకుని.. అక్క‌డ ప‌ని చేసిన నాయ‌కుల‌కు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతాడ‌నే టాక్ ఉంది.

ఈ నేప‌థ్యంలోనే జాతీయ పార్టీ నేత‌లు.. పీకేను పూర్తిగా పక్క‌న పెట్టారని ఢిల్లీలోనూ వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తుంటాయి. కాంగ్రెస్ కూడా.. పీకేపై న‌మ్మ‌కం లేక‌.. `గెట్ ఔట్‌` అన్న‌ది అని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతుంటాయి. ఎందుకంటే.. జాతీయ పార్టీల స్థాయి.. అంత‌ర్జాతీయ స్థాయిలో ఆలోచ‌న‌ల మాదిరిగా ఉంటుంది.. అక్క‌డి ఆర్థిక నిపుణుల అంచ‌నాల‌ను అందుకునే స్థాయిలో జాతీయ పార్టీల వ్య‌వ‌హారం ఉంటుంది. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అంత‌ర్జాతీయ మార్కెట్ స్టాండ‌ర్డ్స్ మేర‌కు ప‌నిచేస్తాయి. పీకే టీం మాత్రం స్థానిక ప‌రిస్థితుల‌ను కూడా ప‌ట్టించుకోకుండా.. చెత్త చెత్త స‌ల‌హాలు ఇస్తుంటాయి. అందుకే.. జాతీయ పార్టీలు.. వీరిని పూర్తిగా ప‌క్కన పెట్టారు.

ఈ విష‌యం గ్ర‌హించిన పీకే టీం.. త‌మ ప‌బ్బం గ‌డుపుకొనేందుకు.. త‌మ చెత్త స‌ల‌హాల‌తో.. పార్టీల‌ను న‌య‌వంచ‌న చేసేందుకు.. ప్ర‌జ‌ల సొమ్మును త‌మ ఫీజులుగా కోట్లాది రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టేందుకు.. స్థానిక పార్టీల‌ను త‌మ వ్యూహంలోకి లాగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా.. పీకే అందుకే.. ప్రాంతీయ‌పార్టీల‌పై క‌న్నేసింద‌నే టాక్ వినిపిస్తుంటుంది. ఇక్క‌డైతే.. ప్రాంతీయ విభేదాలు.. కులాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డం.. సామాజిక వ‌ర్గాల ఓటు బ్యాంకును వేరు చేయ‌డం వంటివి తేలిక‌గా చేయొచ్చు కాబ‌ట్టి.. పీకే టీం.. ఇలా చేసి.. దేశ యువ‌త‌ను.. వారి భ‌విష్య‌త్తును ఆడుకునేలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే వాద‌న నెటిజ‌న్ల నుంచి కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఏపీలో ఇదే జ‌రిగింద‌ని, అందుకే ప్ర‌భుత్వం లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.