Begin typing your search above and press return to search.

నరేంద్రమోడీకి ప్రత్యామ్మాయం ఈయనేనా?

By:  Tupaki Desk   |   12 Jun 2021 3:35 AM GMT
నరేంద్రమోడీకి ప్రత్యామ్మాయం ఈయనేనా?
X
ఆయన స్కెచ్ గీస్తే దేశంలో అఖండ విజయాలతో గద్దెనెక్కిన బీజేపీ కూడా ఓడిపోవాల్సిందే. ఆయన అడుగు పెడితే అక్కడ విజయం తప్ప ఓటమన్నదే లేదు. రాష్ట్రాలన్నింటిని చుట్టేస్తూ ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తూ.. బీజేపీని చిత్తుగా ఓడిస్తున్న దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ వ్యతిరేకులైన మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, సీఎం జగన్ లను గెలిపించిన ఈ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించి ప్రత్యామ్మాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సమావేశమయ్యారు. వీరి మధ్య సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. దీంతో జాతీయ స్థాయిలో నరేంద్రమోడీ ప్రత్యామ్మాయ కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందన్న వార్తలు వచ్చాయి.

అయితే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లకు మద్దతిచ్చిన వారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెబుతున్నానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నప్పటికీ జాతీయ స్థాయిలో ప్రత్యామ్మాయం ఏర్పాటుకు ఆయన సన్నాహాలు ప్రారంభించారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కరోనా లాక్ డౌన్ తో ఇప్పటికే దేశంలో బీజేపీ పాలనపై, నరేంద్రమోడీపై వ్యతిరేకత స్పష్టంగా కనపడుతోందని.. కానీ దాన్ని క్యాష్ చేసుకునే రాజకీయ పార్టీగా కాంగ్రెస్ లేదని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. విశ్వసనీయమైన ప్రత్యామ్మాయాన్ని ఏర్పాటు చేయకపోతే ప్రజలు మోడీని విస్మరించే అవకాశం లేదని ప్రశాంత్ కిషోర్ వర్గీయులు అంచనా వేస్తున్నారు. అందుకోసమే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మిషన్-2024 పేరుతో ఒక బ్లూప్రింట్ రెడీ చేశారని.. వివిధ పార్టీలను కలిసి మోడీకి బలమైన జాతీయ నేతను కూడా సిద్దం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ప్రాంతీయ పార్టీల్లోని బలమైన నేతలను ప్రశాంత్ కిషోర్ కలవబోతున్నారని తెలుస్తోంది.