Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రికి చీఫ్ అడ్వైజర్‌‌గా ప్రశాంత్ కిశోర్ ... కారణం ఇదే !

By:  Tupaki Desk   |   2 March 2021 8:30 AM GMT
ముఖ్యమంత్రికి చీఫ్ అడ్వైజర్‌‌గా ప్రశాంత్ కిశోర్ ... కారణం ఇదే  !
X
ప్రశాంత్ కిషోర్ .. అలియాస్ పీకే .. దేశంలోనే మోస్ట్ పాపులర్ వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. ఎన్నికల వ్యూహకర్తగా ఈయనకి దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. ఒక్కసారిగా వ్యూహం వేశాడు అంటే ఎదుట నిలిచిన వారెవరైనా కూడా ఈయన ఎత్తుల ముందు చిత్తు కావల్సిందే. ఎదో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప , చాలా వరకు ఈయనకి సక్సెస్ రేటు ఎక్కువగానే ఉంటుంది. ఎన్నికల సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించే ఐ-ప్యాక్ సంస్థను నెలకొల్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వైసీపీ అధినేత , ఏపీ సీఎం వైఎస్ జగన్ కి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో మలచుకోవడానికి ఆయన ఇచ్చిన సలహాలు అద్భుతంగా పనిచేశాయి. దీనితో 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్ ‌సభ స్థానాలను గెలచుకోగలిగింది. వైసీపీ సాధించిన ఈ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారనేది అందరికి తెలిసిన విషయమే.

ఆ తర్వాత బిహార్ ‌లో అధికారంలో ఉన్న జేడీయూలో చేరారు. ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అనంతరం సీఏఏ అమలు విషయంలో సీఎం నితీష్ కుమార్‌ తో విభేదించి బయటికి వచ్చారు. తరవాత మమతా బెనర్జీ వద్ద రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది విడతల్లో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంటుందని రెండు నెలల కిందటే జోస్యం చెప్పారు. దానికే తాను కట్టుబడి ఉన్నాననీ రెండు రోజుల కిందట ప్రకటించారు. ఇదిలా ఉండగానే ఆయనకి మరో బంపర్ ఆఫర్ తగిలింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. తన ప్రధాన సలహాదారుగా చేరినట్టు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోమవారం వెల్లడించారు.

ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ప్రశాంత్ కిశోర్ నియమకానికి ఆమోదించింది. ఈ విషయమై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ప్రశాంత్ తో కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని ట్వీట్ చేశారు. ఆయనకు ఒక్క రూపాయి మాత్రమే గౌరవ వేతనంగా చెల్లిస్తున్నామని తెలిపారు. పంజాబ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ విధమైన చర్యలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన పట్టును మరింత నిలుపుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రశాంత్ కిషోర్‌‌ సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే ఆయన్ని చీఫ్ అడ్వైజర్‌‌ గా నియమించింది. 2017 శాసనసభ ఎన్నికల్లోనూ పంజాబ్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టింది ప్రశాంత్ నేతృత్వంలోని రాజకీయ సలహాదారు సంస్థ ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ). ఆ ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలకు గానూ.. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. ఇక 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రావడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. స్థానిక పరిస్థితులకు తగినట్లు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించే సంస్థగా ఐ-ప్యాక్ కు మంచి పేరుంది.