Begin typing your search above and press return to search.

మళ్లీ రంగంలోకి రానున్న పీకే టీం.. ఏపీలో ఎప్పుడు దిగుతుందంటే?

By:  Tupaki Desk   |   17 Sept 2021 9:08 AM IST
మళ్లీ రంగంలోకి రానున్న పీకే టీం.. ఏపీలో ఎప్పుడు దిగుతుందంటే?
X
తాజాగా ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్ని ప్రకటన రూపంలో చెప్పేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కాబినెట్ భేటీ అయ్యాక.. సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలకు దాదాపు రెండున్నరేళ్లు గడువు ఉన్నప్పటికి.. అందుకు ముందే సిద్ధం కావాలన్న స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల మూడ్ లోకి ఇప్పటి నుంచే షిఫ్టు అయిపోవాలన్న ఆయన.. పార్టీని.. ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లాలని మంత్రులకు సూచన చేయటం గమనార్హం. అంతేకాదు.. ఎన్నికల వ్యూహాలపైనా సంకేతాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అన్నింటికి మించి వచ్చే ఏడాది నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీం రంగంలోకి దిగుతుందన్న మాట విస్మయానికి గురి చేస్తోంది.

దాదాపు రెండున్నరేళ్లకు ముందే ఎన్నికలకు సంబంధించిన అంశాల్ని పీకే టీంకు అప్పజెప్పటం ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఇప్పటి నుంచే ప్రజాప్రతినిధులు పర్యటనలు చేయాలని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. విపక్షాలు విరుచుకుపడితే.. వారికి అంతే ధీటుగా బదులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచన చేశారు.

అధికారికంగా కేబినెట్ మీటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత దాదాపు అరగంట పాటు సమావేశం జరిగిందని.. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం జగన్ పలు సూచనలు చేయటంతో పాటు..విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు కూడా పీకే టీం రంగంలోకి దిగటం.. వ్యూహాత్మకంగా ప్రజల్లో చర్చను తీసుకొచ్చి.. జగన్ సాధించిన ఘన విజయంలో కీలకభూమిక పోషించారని చెప్పాలి. మరి.. ఈసారి ఆ మేజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.