Begin typing your search above and press return to search.

ఈ అనంతపురం క్రికెటర్ చాలా గ్రేట్

By:  Tupaki Desk   |   1 Nov 2015 10:33 AM GMT
ఈ అనంతపురం క్రికెటర్ చాలా గ్రేట్
X
కన్నతండ్రి మరణించిన బాధ ఓ వైపు... రాష్ట్రం తరఫున ఆడాల్సిన మ్యాచ్ మరోవైపు... గుండెలో బాధను దిగమింగుకుని మైదానంలోకి దిగాడు. అలాంటి పరిస్థితుల్లోనూ అనంతపురానికి చెందిన ఆ యువ క్రికెటర్ ఎంతో అద్భుతంగా ఆడాడు.

ఆంధ్రా జట్టు తరఫున పంజాబ్‌ లో జరిగిన మ్యాచ్‌ లో ఆంధ్రా క్రికెటర్ ప్రశాంత్ కుమార్ అదరగొట్టాడు. తండ్రి అంత్యక్రియలు ముగియగానే జట్టుకు తన సేవలు అందించాలనే ఉద్దేశంతో పాటియాలకు వెళ్లాడు. తండ్రి మరణిస్తే ఎవరైనా తమ పనులన్నీ పక్కనపెట్టేసి అంత్యక్రియలు, తదనంతర కార్యక్రమాల్లో ఉంటారు. ప్రశాంత్ మాత్రం తండ్రి అంత్యక్రియలకు వెళ్లి, ఒక్కరోజులోనే క్రికెట్‌ కోసం తిరిగి వెళ్లాడు. అనంతపురానికి చెందిన 23 ఏళ్ల ఈ కుర్రాడు ఆంధ్ర జట్టులో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. రంజీ మ్యాచ్‌ కోసం పంజాబ్‌లోని పటియాలాలో ఉండగా మ్యాచ్‌కు ముందు తండ్రి మరణ వార్త తెలిసింది. వెంటనే ఇంటికి వచ్చి తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడు. తిరగి పటియాలాకు వచ్చేశాడు.

అయితే పంజాబ్‌ తో మ్యాచ్‌ లో తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రా 80 పరుగులకే కుప్పకూలింది. బాధను దిగమింగి అంకితభావంతో ఆడిన ప్రశాంత్‌ 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. అంతేకాదు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 4 వికెట్లు తీయడమే కాక ఒక కీలక రనౌట్‌ చేసి ఆ జట్టు 147 పరుగులకే ఆలౌట్‌ కావడంతో కీలకపాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌ లోనూ ప్రశాంత్‌ 29 పరుగులు చేశాడు. మ్యాచ్‌ ప్రాధాన్యాన్ని గుర్తించి కచ్చితంగా పంజాబ్‌తో ఆడదామనే నిర్ణయించుకున్నానని, బంధువులు వద్దని చెప్పినా వినలేదని, తండ్రి మరణం చాలా బాధగా ఉందని, అయినా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని ప్రశాంత్‌ చెప్పాడు. ఇదిలా ఉండగా... పంజాబ్‌తో రంజీ మ్యాచ్‌ లో ఆంధ్ర 7 వికెట్ల తేడాతో ఓడింది. తొలి ఇన్నింగ్స్‌ లో 80 పరుగులకే కుప్పకూలిన ఆంధ్ర. రెండో ఇన్నింగ్స్‌ లో 133 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో పంజాబ్‌ ముందు కేవలం 67 పరుగుల లక్ష్యం నిలవగా.. ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ ఓడిపోయినా ప్రశాంత్ అక్కడ అందరి మనసులను, క్రికెట్ అభిమానుల మనసులను గెలిచాడు.