Begin typing your search above and press return to search.

పీకే అంచనాల్లో ఏపీ ఎవరిది...?

By:  Tupaki Desk   |   1 May 2022 10:36 AM GMT
పీకే అంచనాల్లో ఏపీ ఎవరిది...?
X
దేశంలో పేరు మోసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జగన్ని సీఎం చేశారు. అప్పటికి దాదాపు పదేళ్ళుగా అధికారం కోసం జగన్ పరిశ్రమిస్తున్నారు. నిజానికి ప్రశాంత్ కిశోర్ తో జత కట్టకపోయినా ఆ ఎన్నికల్లో జగన్ గెలిచేవారు అని చెబుతారు. అయితే పీకే జట్టుతో బంపర్ విక్టరీ సాధ్యమైంది. ఇక పీకే గెలుపుతో పాటు ఒక గుదిబండను జగన్ నెత్తిన వేశారు.

అదే నవరత్నాలు. దేశంలో ఎక్కడా ఎవరూ చేయని విధంగా సంక్షేమ పధకాలను ఏపీలో అమలు చేశారు జగన్. ఈ నవరత్నాల స్క్రిప్ట్ అంతా పీకే బుర్రలో నుంచి పుట్టినదే. దాని కోసం మొత్తానికి మొత్తం ఖజానాను దోచిపెడుతున్నా ఎక్కడా సరిపోవడం లేదు. అప్పులు చేసినా చివరికి ఆస్తులను కుదువ పెట్టినా మరో పాతికేళ్లకు వచ్చే ఆదాయాన్ని హామీ పెట్టి అప్పులు తెచ్చినా నవరత్నాల ఊబి నుంచి బయటపడడం వైసీపీ సర్కార్ కి కష్టమైపోతోంది.

ఇక అభివృద్ధి మరో వైపు లేదు. దాంతో పాటు కరోనా రెండేళ్ల పాటు విలయతాండవం చేసిన నేపధ్యంలో ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. నిజానికి ఏపీకి ఆదాయాలే అంతంత మాత్రంగా ఉన్న వేళ ఇది నెత్తిన తాటిపండు పడిన చందమైంది. దాంతో జగన్ అనుకున్న దానికి జరుగుతున్న దానికీ ఎక్కడా పొంతన లేకుండా పోతోంది.

కేవలం పంచుడు కే పరిమితం అయినా అది కూడా చివరి రెండేళ్ళూ సవ్యంగా సాగేలా కనిపించడంలేదు. ఈ నేపధ్యంలో సమాజంలో అనేక వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోయింది. అంతవరకూ ఎందుకు సొంత పార్టీలో కూడా అసహనం పెరిగింది.

ఇవన్నీ చూసిన పీకే ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని మళ్ళీ గెలిపించడం కష్టమన్న అంచనాకు వచ్చారని అంటారు. అందుకే ఆయన తప్పుకున్నారు అన్న చర్చ నడుస్తోంది. తాను తెచ్చి పెట్టిన నవరత్నాలే ఇపుడు వైసీపీకు గుదిబండగా మారాయన్నది పీకేకు బాగా తెలుసు. దానికి విరుగుడు మంత్రం ఆయన వద్ద కూడా లేదు. దాంతో వైసీపీమి మరో సారి గెలిపించేందుకు వ్యూహకర్తగా డీల్ ని ఆయన చేసుకోలేదని అంటున్నారు.

వైసీపీ మీద జనాల్లో వేగంగా వ్యతిరేకత పెరుగుతోందని పీకే గ్రహించారుట. ఆయనకు ఉన్న సోర్సెస్ ద్వారా ఈ విషయం బాగానే చేరింది అంటున్నారు. అదే టైమ్ లో ఏపీలో విపక్ష టీడీపీ అంతే వేగంగా వైసీపీ నుంచి వచ్చిన ప్రజా వ్యతిరేకతను అందిపుచ్చుకోలేకపోవడాన్ని కూడా ఆయన గమనించారు  అని చెబుతున్నారు.

దీంతో వైసీపీ తరఫున వ్యూహకర్తగా వ్యవహరించి 2024లో మళ్లీ అధికారంలోకి తేవడం అన్నది రిస్కీ ఫీట్ గా ఆయన భావించే  తప్పుకున్నారు అని చెబుతున్నారు. ఇపుడున్న పరిస్థితి కంటిన్యూ అయి టీడీపీ ఏ మాత్రం పుంజుకోకపోతే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే చాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే అన్నది పీకే టీమ్ అంచనాగా చెబుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో  వైసీపీ గెలవకపోతే ఆ మచ్చ తన మీద పడుతుంది అన్న ముందు చూపుతోనే బై బై అనేశారు పీకే అని ప్రచారం సాగుతోంది.

మొత్తానికి నాడు పీకే అధికారంలోకి రావడానికి నవరత్నాలను దగ్గర మార్గాలుగా చూపించారని సంతోషించాలో లేక ఇపుడు అవే తమ కాళ్ళకు సంకెళ్లుగా మారి రేపటి భవిష్యత్తుని లేకుండా చేస్తున్నాయని చింతించాలో తెలియక వైసీపీ హై కమాండ్ మాత్రం తెగ కలవరపడుతోంది. ఈ నేపధ్యంలో పీకే టీమ్ అసరా  లేకుండా వైసీపీ తానుగా గెలిచి చూపిస్తే మాత్రం గ్రేట్ ఫీట్ గానే అభివర్ణించాల్సి ఉంటుంది.