Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ లోనే బస చేసిన పీకే.. అంత మథనం ఏమిటో?

By:  Tupaki Desk   |   24 April 2022 4:49 AM GMT
ప్రగతిభవన్ లోనే బస చేసిన పీకే.. అంత మథనం ఏమిటో?
X
అటు సార్వత్రిక ఎన్నికలు కానీ.. ఇటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరగాల్సిన ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లకు పైనే సమయం ఉంది. కాదంటే రెండేళ్లు. కానీ.. రాజకీయ వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా మారింది. ఎన్నికల ఏడాది ఎంత హడావుడి ఉంటుందో అలాంటి పరిస్థితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉందని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గడిచిన నాలుగైదు రోజులుగా మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నారు రాజకీయ వ్యూహకర్త పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్.

ఓపక్క కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకు.. ఆ పార్టీతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా పలు రాజకీయ పక్షాల్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పీకే. అయితే.. కాంగ్రెస్ లో చేరాలన్నదే ప్రశాంత్ కిశోర్ ఆలోచన అయితే.. ఆయన వ్యాపారాలు(పొలిటికల్ కన్సల్టెన్సీ.. రాజకీయ పార్టీలకు వ్యూహాల్ని సిద్ధం చేసి ఇవ్వటం) మానుకోవాలని ఆ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ లో చేరటం పీకేకు ప్రాధాన్యత అంశంగా చెబుతారు. మరోవైపు తన సేవల కోసం తపించే రాజకీయ పార్టీలకు వ్యూహాల్ని సిద్దం చేయటంతో పాటు.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు అధినేతల్ని తనకు అనుకూలంగా మలుచుకోవటం కూడా పీకే ముందున్న ప్రాధాన్యతలుగా చెబుతారు.

కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్న పీకే.. మీ పార్టీకి సేవలు అందిస్తున్నారంటూ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను అడిగితే.. మీడియాలో వార్తలు వస్తున్నాయని.. వాటి గురించి తెలుసుకోవాలన్నారు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఈ ఇంటర్వ్యూ సదరు మీడియా సంస్థలో ప్రచురితమైన రోజునే.. పీకే ప్రగతి భవన్ లో ఉండటం. శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో పీకే మేధోమథనం చేయటం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ అధినాయకత్వంతో వరుస పెట్టి సమావేశాల్ని నిర్వహించిన ఆయన.. హటాత్తుగా హైదరాబాద్ కు రావటం.. కేసీఆర్ తో కలిసి భేటీ కావటం.. అది కాస్తా సుదీర్ఘంగా సాగటమే కాదు.. ఆదివారం కూడా చర్చల్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రగతిభవన్ లోనే స్టే చేశారు. పీకే సంస్థతో టీఆర్ఎస్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో పీకే టీం రాజకీయ అంశాల్ని.. పాలనాంశాలపై సర్వే నిర్వహించారు. తొలుత 30 నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వే ఫలితాల్ని ఇవ్వగా.. తాజాగా మరో 89 నియోజకవర్గాల సర్వే జరిగింది.

కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని భావిస్తున్న పీకే.. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ సంస్థ టీఆర్ఎస్ కు సేవలు అందిస్తుందన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణ కోసం చర్చల్ని కొనసాగించాలన్న నిర్ణయానికి కేసీఆర్ రావటంతో.. పీకేను ప్రగతిభవన్ లోనే స్టే చేయాలని కోరటం.. అందుకు పీకే సైతం ఓకే అనటంతో ఆయన శనివారం రాత్రి ప్రగతిభవన్ లోనే ఉండిపోయారు. ఇప్పుడీ ఉదంతం రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది.