Begin typing your search above and press return to search.

పత్తిపాటి.. రావెల.. కాస్త ఎక్కువైనట్లు లేదు?

By:  Tupaki Desk   |   12 Nov 2016 4:56 AM GMT
పత్తిపాటి.. రావెల.. కాస్త ఎక్కువైనట్లు లేదు?
X
వినయం.. విధేయత.. విశ్వాసం.. స్వామిభక్తితో రాజకీయాల్లో ఎదగటం మామూలే. కానీ.. ఏమీ మోతాదు మించకూడదు. కీలక స్థానాల్లో ఉన్న వారు.. అందునా రాజకీయాల్లో ఉన్న వారు తాము మాట్లాడే మాటల్ని కాస్త ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. స్వామిభక్తిని ప్రదర్శించటానికో.. విధేయతను చాటుకోవటానికో చెప్పే మాటలతో తాము ఎవరినైనా అభిమానిస్తున్నామో.. వారికి సైతం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. తాజాగా ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు.. రావెల కిశోర్ బాబుల వ్యాఖ్యలు ఇదే తరహాలో ఉన్నాయి.

పార్టీ అధినేత కుమారుడు కమ్ పార్టీ జాతీయ కార్యదర్శి అయిన నారా లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ మంత్రులు వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే తెలంగాణ అధికారపక్షం నేతలు సైతం మంత్రి కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. తన శక్తి సామర్థ్యాల్ని పూర్తిగా ప్రదర్శించి.. తండ్రికి తగ్గ తనయుడిగా.. కేసీఆర్ తర్వాత వారసుడిగా అనధికారికంగా ఫిక్స్ అయినప్పటికీ ఈ విషయాన్ని ప్రస్తావించటానికి తెలంగాణ మంత్రులు ఎవరూ ధైర్యం చేయరు. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆరోగ్యంగా.. సమర్థవంతంగా పాలిస్తున్న తరుణంలో కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది అప్రస్తుతం.

సరిగ్గా ఇదే పోలిక ఏపీ ముఖ్యమంత్రికి.. లోకేశ్ కు అప్లై అవుతుందన్నది మర్చిపోకూడదు. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు చేస్తున్న శ్రమ.. పడుతున్న కష్టం చూసినప్పుడు ఆయన మరో టర్మ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించటానికి సరిపోయే సామర్థ్యం ఉందన్న విషయం స్పష్టమవుతుంది. అలాంటప్పుడు లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రి అని మంత్రులు ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ మరో అంశం కూడా ఉంది. పార్టీ కీలక నేతగా లోకేశ్ శక్తి సామర్థ్యాలు పార్టీ నేతలకు.. కార్యకర్తలకు తెలిసి ఉండొచ్చు. కానీ.. ప్రజలకు మాత్రం ఆయన సత్తా ఏమిటో పూర్తిస్థాయిలో తెలీదు.

ఇప్పటివరకూ మంత్రిగా బాధ్యతలు చేపట్టని లోకేశ్ ను కాబోయే సీఎంగా అభివర్ణించటం.. మోతాదు మించిన స్వామిభక్తిగా చెప్పక తప్పదు. చంద్రబాబు తర్వాత వారసుడు.. కాబోయే సీఎం లోకేశ్ అంటూ తాడికొండ మండలం బండారుపల్లిలో జరిగిన జనచైతన్య యాత్ర సందర్భంగా మంత్రులు పేర్కొనటం చూస్తే.. వారు కాస్త తొందరపడినట్లుగా కనిపించక మానదు. ఇలాంటి వ్యాఖ్యలు లోకేశ్ కు ఇబ్బందికరంగా మారతాయన్న విషయాన్ని మంత్రులు గమనిస్తే మంచిది. అన్నింటికి మించి ఈ తరహా ప్రచారాన్ని.. వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కంట్రోల్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయినా.. బాబు వారసుడు లోకేశ్ కాక మరెవరు? ఆ విషయాన్ని సరికొత్తగా చెప్పాల్సిన అవసరం పత్తిపాటి.. రావెలకు ఎందుకు వచ్చినట్లు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/