Begin typing your search above and press return to search.

ఆకర్ష్..వికర్ష్ అంటున్న పత్తిపాటి మాటలు విన్నారా?

By:  Tupaki Desk   |   24 April 2016 9:45 AM GMT
ఆకర్ష్..వికర్ష్ అంటున్న పత్తిపాటి మాటలు విన్నారా?
X
ఠారెత్తిస్తున్న ఎండల మాదిరే ఏపీ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఏ రోజు ఏ విపక్ష నేత అధికారపక్షంలోకి జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ విపక్ష నేత జగన్ ఓ రేంజ్ లో వాపోతున్నా.. వలసలు మాత్రం ఆగటం లేదు. ఇప్పటికే 13 మంది జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేయగా.. తాజాగా మరో ఇద్దరు (శ్రీశైలం.. అరకు) ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. సేవ్ డెమోక్రసీ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఇచ్చిన పిలుపుపై ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు పార్టీలను ఫిరాయించేలా ప్రోత్సహించింది దివంగత ప్రధాని పీవీ నరసింహారావు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలేనని మండిపడ్డారు. పీవీ హయాంలో ఆరుగురు ఎంపీలు పార్టీలు మారారని.. ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ ను స్టార్ట్ చేసింది వైఎస్సేనన్న విషయం మర్చిపోకూడదన్నారు.

వైఎస్ హయాంలో 13 మంది ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయటాన్ని ప్రశ్నించిన పత్తిపాటి.. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు. తండ్రి హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ చేపడితే.. కొడుకు హయాంలో ఆపరేషన్ వికర్ష్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని.. వారంతట వారే వస్తున్నట్లుగా పత్తిపాటి చెప్పారు. పత్తిపాటి మాటల్నిచూస్తే.. ఆకర్ష్ తో పాటు వికర్ష్ తప్పదని అర్థమవుతుంది. మరీ విషయాన్ని చంద్రబాబు అండ్ కో కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది సుమా.