Begin typing your search above and press return to search.

బాబు హామీలకు ప‌రాకాష్ట‌: అన్న క్యాంటీన్లేనా

By:  Tupaki Desk   |   29 Sep 2017 5:42 AM GMT
బాబు హామీలకు ప‌రాకాష్ట‌: అన్న క్యాంటీన్లేనా
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు గ్రేట్ అని త‌నకు తానే స‌ర్టిఫికెట్ ఇచ్చుకోవ‌డం కొత్త‌కాదు. అంతేకాదు, త‌న టీంలో త‌న క‌న్నా క‌ష్ట‌ప‌డే వారు మ‌రొక‌రు లేర‌ని కూడా ఆయ‌న సెల‌విస్తూనే ఉన్నారు. దీనికిగాను ఆయ‌న స‌ర్వేల‌నే చ‌ట్రంలో కొల‌త‌లు - లెక్క‌లు వేస్తూ.. టీడీపీ నేత‌ల్లో తాను త‌ప్ప‌.. ఇంకెవ‌రూ క‌ష్ట‌ప‌డ‌డం లేద‌నే కామెంట్లు అనేక సార్లు రువ్వారు కూడా. ఇక‌, ఎన్నిక‌ల హామీల‌కు సంబంధించి త‌మ ప్ర‌భుత్వం తీర్చిన‌ట్టు ఏ ప్ర‌భుత్వ‌మూ తీర్చ‌డం లేద‌ని కూడా బాబు గారు సెల‌విచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే, రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన చంద్ర‌బాబు హామీ అమలు ప‌డ‌కేసింది. ఎన్నిక‌లు జ‌రిగి - బాబు సీఎం సీటును చేబ‌ట్టి.. దాదాపు మూడున్న‌ర ఏళ్లు పూర్త‌య్యాయి. అయినా కూడా నాటి హామీల‌పై నేటికీ స్ప‌ష్ట‌త - సాకారం లేనేలేదు. వీటిలో ప్ర‌ధాన‌మైంది అన్న క్యాంటీన్లు. త‌మిళ‌నాడులో స‌క్సెస్ అయిన ఈ ప‌థ‌కాన్ని అందిపుచ్చుకున్న సీఎం చంద్ర‌బాబు.. రాష్ట్రంలోనూ ఈ త‌ర‌హా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా పేద‌ల‌ - దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఆక‌లిని తీరుస్తాన‌ని చెప్పారు.

దీనికిగాను గ‌తంలో పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రిగా ఉన్న ప‌రిటాల సునీత ఆధ్వ‌ర్యంలో చైన్నైలో రెండు సార్లు అధికారులు - మంత్రులు(వీరిలో నారాయ‌ణ కూడా ఉన్నారు) ప‌ర్య‌టించారు. నివేదిక త‌యారు చేసి ప్ర‌భుత్వానికి ఇచ్చారు. అయినా నేటికీ ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌క‌ట‌నా విడుద‌ల చేయ‌లేదు. ఇప్పుడు తాజాగా ఇదే విష‌యంపై స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్న‌క్యాంటీన్ల అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు చెప్పారు. 50వేల జనాభాకు ఒకటి చొప్పున అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిపారు. వీటిని పురపాలక - పౌరసరఫరాల శాఖ సమన్వయంతో ఏర్పాటు చేస్తామన్నారు. అయితే, ఎప్పుడు ఏర్పాటు చేసేదీ క్లారిటీ ఇవ్వ‌లేక‌పోయారు స‌ద‌రు మంత్రి వ‌ర్యులు! ఇలా ఉంది ఏపీలో టీడీపీ ఎన్నిక‌ల హామీల ప‌రిస్థితి!!