Begin typing your search above and press return to search.

మాజీమంత్రి అత్యాశ..ప్రతీకారం తీర్చుకుంటారంట!

By:  Tupaki Desk   |   3 Feb 2020 8:44 AM GMT
మాజీమంత్రి అత్యాశ..ప్రతీకారం తీర్చుకుంటారంట!
X
ఎన్నికల్లో ఘోర పరాభవంతో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి పాలనతో టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. గతంలో చేసిన టీడీపీ పాపాలను లెక్కబెట్టి ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పచ్చ పార్టీ నాయకులు లబోదిబోమంటున్నారు. ఏమాత్రం తోక జాడించినా వెంటనే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చ తమ్ముళ్లు బెదురుతున్నారు. ఈ ఆక్రోశంతో మాజీమంత్రి - తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ప్రతిపాటి పుల్లారావు పలు వ్యాఖ్యలు చేశారు.

’మా ప్రభుత్వం వస్తది. అప్పుడు మీపై ప్రతీకారం తీర్చుకుంటాం. కేవలం మీపై ప్రతికారం తీర్చుకునేందుకే పనిచేస్తాం. మీరు మా మీద నాలుగు కేసులు వేస్తే అప్పుడు మేం పది కేసులు నమోదు చేస్తాం. ప్రతికారం తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటాం‘ అని బహిరంగంగా ప్రకటించారు. ఇంత కోపం ఎందుకొచ్చిందంటే రాజధాని వికేంద్రీకరణపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు - నాయకులు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. ఆందోళనలను ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. ఈ క్రమంలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పుల్లారావు ఆక్రోశం వెల్లగక్కారు. చీమ చిటుక్కుమన్న ప్రభుత్వం పోలీసులతో నిర్బంధిస్తోందని వాపోయారు. అయితే ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఆశ కూడా ఉండడం అత్యాశగా ఉంది. అధికారంలో ఉన్నన్నాళ్లు అందరిపై ఉక్కుపాదం మోపి పాలించిన టీడీపీ ఇప్పుడు మళ్లీ ఎలా అధికారంలోకి వస్తామని భావిస్తున్నారో వారికే తెలియాలి.

మీరే చేసిన అవినీతిని తవ్వేందుకే మూడు రాజధానుల ప్రతిపాదన - అమరావతిని అడ్డుగా పెట్టుకుని చేసిన అవినీతిని కక్కించేందుకు సీఎం జగన్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాడని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని పాలిస్తున్న జగన్ అని విమర్శలు చేసే ముందు గతంలో తమరు ఎలా పాలించారో గుర్తుచేసుకోవాలని ఫ్యాన్ గుర్తు పార్టీ నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇంకా తాము అధికారంలోకి వస్తామనే ఆశ ఉండడం అతిశయోక్తిగా కనిపిస్తోందని పేర్కొంటున్నారు.