Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు ప్ర‌వీణ్ కుమార్ స‌వాల్ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   26 Aug 2021 10:30 AM GMT
కేసీఆర్‌కు ప్ర‌వీణ్ కుమార్ స‌వాల్ త‌ప్ప‌దా?
X
తెలంగాణ‌లోని పార్టీల‌న్నీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పైనే దృష్టి పెట్టాయ‌న‌డంలో సందేహం లేదు. ఇంకా నోటిఫికేష‌న్ రాన‌ప్ప‌టికీ అస‌లు ఆ ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుంద‌నే స్ప‌ష్టత కూడా లేన‌ప్ప‌టికీ రాజ‌కీయ వాతావ‌ర‌ణం మాత్రం పూర్తిగా వేడెక్కెంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో విజయం కోసం సీఎం కేసీఆర్ శాయాశ‌క్తులా కృషి చేస్తున్నారు. ఎలాగైనా ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రో కొత్త టెన్ష‌న్ ఆయ‌న‌లో మొద‌లు కానుంది. అదే.. హుజూరాబాద్‌లో బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) పోటీ చేయ‌బోతుంద‌నే వార్త‌. ఒక‌వేళ అదే నిజ‌మైతే ఆ పార్టీలో కొత్త‌గా చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నుంచి కేసీఆర్‌కు స‌వాలు త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక‌లో విజ‌యం కేసీఆర్‌కు అత్యంత ఆవ‌శ్య‌కం. ఎందుకంటే త‌న పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీ తీర్థం పుచ్చుకుని త‌న‌పైనే పోరాటానికి సిద్ధ‌మైన ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల కేసీఆర్‌లో ఉంది. ఒక‌వేళ ఈ ఎన్నిక‌ల్లో ఈట‌ల గెలిస్తే అది కేసీఆర్‌పై పెను ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. అందుకే ఈ ఎన్నిక‌ల్లో ఈట‌ల‌ను ఓడించి పార్టీని వ‌దిలి వెళ్లిన‌వాళ్ల‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ లేద‌ని నిరూపించాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అందుకే అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అక్క‌డి ద‌ళిత ఓట్ల కోసం ద‌ళిత బంధు పథ‌కాన్ని మొద‌ట‌గా అక్క‌డే ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల బ‌రిలో బీఎస్పీ నిలుస్తుంద‌నే వార్త‌లు కేసీఆర్‌ను కంగారు పెట్టించేవే. ఎందుకంటే అక్క‌డ ఆ పార్టీ త‌ర‌పున ఎవ‌రు పోటీ చేసినా ప్ర‌వీణ్ కుమార్ క‌చ్చితంగా అన్ని బాధ్య‌త‌లు తీసుకుని విజ‌యం కోసం ప్ర‌య‌త్నిస్తారు.

బ‌హుజ‌నుల సంక్షేమం కోసమే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని ప్ర‌క‌టించిన ప్ర‌వీణ్ కుమార్‌కు ద‌ళిత వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది. కొద్ది రోజుల క్రిత‌మే బీఎస్పీలో చేరిన ప్ర‌వీణ్ కుమార్‌కు ద‌ళిత వ‌ర్గంలో మంచి ఆద‌ర‌ణ ఉంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న పార్టీలో చేరేందుకు న‌ల్గొండ‌లో ఏర్పాటు చేసిన స‌భ‌కు ప్ర‌జ‌ల నుంచి గొప్ప స్పంద‌న రావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో బీఎస్పీ కార్య‌క‌లాపాల‌న్నీ ప్ర‌వీణ్ కుమార్ సార‌థ్యంలోనే సాగే అవ‌కాశ‌ముంది. హుజూరాబాద్‌లో పోటీ చేయాలా? వ‌ద్దా? అనే అంశంపై తుది నిర్ణ‌యం కూడా ఆయ‌న‌దే అని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఆయ‌న పోటీకి అంత‌గా ఆస‌క్తి చూపించ‌న‌ప్ప‌టికీ బ‌రిలో దిగాల‌ని వివిధ వ‌ర్గాల నుంచి ఆయ‌న‌పై ఒత్తిడి వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఈ అంశంపై క‌రీంన‌గ‌ర్ జిల్లాలో జ‌రిగే స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఒక‌వేళ బీఎస్పీ హుజూరాబాద్‌లో పోటీచేస్తే అభ్య‌ర్థిగా ప్ర‌వీణ్ కుమార్ లేక‌పోయిన‌ప్ప‌టికీ పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ల త‌ర‌పున ఆయ‌న క‌చ్చితంగా ప్ర‌చారం చేస్తారు. అప్పుడు ప్ర‌ధానంగా అధికార టీఆర్ఎస్‌నే ల‌క్ష్యంగా చేసుకుంటార‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే కేసీఆర్ ప్ర‌భుత్వ పాల‌న‌పై త‌న‌దైన శైలిలో ప్ర‌వీణ్ కుమార్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న దిగితే అది టీఆర్ఎస్‌కు వ‌చ్చే ద‌ళిత ఓట్ల‌పై క‌చ్చితంగా ప్ర‌భావం చూపే వీలుంద‌ని రాజ‌కీయ వేత్త‌లు అనుకుంటున్నారు. ద‌ళిత ఓట్లు చీలే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకుంటున్నారు. దీంతో అక్క‌డి ద‌ళిత ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించుకోవ‌డం కోసం పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్న కేసీఆర్‌కు గ‌ట్టి దెబ్బ త‌గిలే ఆస్కార‌ముంద‌ని అనుకుంటున్నారు.