Begin typing your search above and press return to search.

ప్ర‌వీణ్ కుమార్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఖ‌రారు.. ఆ పార్టీలోకే!

By:  Tupaki Desk   |   27 July 2021 10:30 AM GMT
ప్ర‌వీణ్ కుమార్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఖ‌రారు.. ఆ పార్టీలోకే!
X
''ఇక నుంచి బాబాసాహెబ్ అంబేద్క‌ర్‌, మ‌హాత్మ జ్యోతిరావు పూలే, కాన్షీరాం మార్గంలో న‌డుస్తాను. భావిత‌రాల‌ను కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తాను. నా సర్వీసులో కేవలం ఒక్కశాతం మాత్రమే పేదలకు సేవలు అందించగలిగాను. వందశాతం పేదల పక్షాన ఉండాలనే రాజీనామా చేస్తున్నాను.'' ఇదీ.. త‌న‌రాజీనామా సంద‌ర్భంగా ఆర్‌.ఎస్. ప్ర‌వీణ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు. దీంతో.. ఆయ‌న అడుగులు రాజ‌కీయాల వైపు మ‌ళ్ల‌బోతున్నాయ‌ని అప్పుడే అర్థ‌మైపోయింది. అయితే.. ఏ పార్టీలోకి చేర‌తారు? అనే విష‌యంలో మాత్రం క్లారిటీ రాలేదు.

అయితే.. ఆయ‌న టీఆర్ఎస్ లో చేర‌తార‌ని మొద‌ట మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. గులాబీ పార్టీకి అత్యంత కీల‌కంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ప్ర‌వీణ్ కుమార్ నిల‌బ‌డ‌తార‌ని, ఇందుకోస‌మే రాజీనామా చేశార‌ని కూడా అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ.. ఈ వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. త‌న‌కు అలాంటి ఆలోచ‌నే లేద‌ని చెప్పారు. రాజ‌కీయాల్లో రావ‌డం ప‌క్కా అని చెప్పిన ప్ర‌వీణ్ కుమార్‌.. ఏ పార్టీలోకి వెళ్తాన‌నేది మాత్రం స్ప‌ష్టంగా క్లారిటీ ఇవ్వ‌లేదు.

కానీ.. బ‌హుజ‌న వాదం వినిపించ‌డంతో బీఎస్పీ వైపున‌కు వెళ్ల‌బోతున్నార‌ని క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. అయితే.. తాజాగా బ‌హుజ‌న స‌మాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావ‌తి చేసిన ప్ర‌క‌ట‌న‌తో పిక్చ‌ర్ క్లియ‌ర్ అయ్యింది. ''కాన్షీరాం అడుగుజాడ‌ల్లో న‌డిచేందుకు తెలంగాణ‌కు చెందిన మాజీ సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్.. బీఎస్పీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న పార్టీలో చేర‌తారు'' అని మాయావతి చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది. దీంతో.. ఇక‌, అధికారికంగా ప్ర‌వీణ్ కుమార్ బీఎస్పీలో చేర‌డ‌మే మిగిలి ఉంది.

ఇదిలాఉంటే.. ప్ర‌వీణ్ కుమార్ రాజ‌కీయ నేత‌గా ఎలాంటి ప్ర‌భావం చూపిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. గురుకులాల కార్య‌ద‌ర్శిగా ఉన్నంత వ‌ర‌కు అద్భుత‌మైన ప్ర‌గ‌తిని సాధించార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. దాదాపు.. ఎనిమిదేళ్లుగా గురుకులాల‌ను నిర్వ‌హిస్తున్నా ఆయ‌న‌.. చ‌దివితే గురుకులాల్లోనే చ‌ద‌వాలి అన్నంతంగా మార్చేశార‌ని చెబుతారు. అయితే.. కాల క్ర‌మంలో ఆయ‌న‌పై ఓ వ‌ర్గం వారు విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టారు. స్వేరోస్ పేరుతో ఒక వ‌ర్గంపై వ్య‌తిరేక ప్ర‌చారం చేయిస్తున్నార‌ని, విద్యార్థుల్లో ఆ విధ‌మైన భావ‌జాలం పెంపొందిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ ఏడాది మార్చిలో పెద్ద‌ప‌ల్లి జిల్లా జూల‌పెల్ల మండ‌లం ధూలిక‌ట్ట గ్రామంలో స్వేరోస్ ఆధ్వ‌ర్యంలో భీమ్ దీక్ష చేప‌ట్టిన సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ కార్య‌క్ర‌మంలో స్వేరోస్ స‌భ్యుడు, ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు న్యాత‌రి శంక‌ర్ బాబు భీమ్ ప్ర‌తిజ్ఞ చేయించారు. (ఇది స్వ‌యంగా అంబేద్క‌ర్ రాసి, చేసిన‌ ప్ర‌తిజ్ఞ‌గా చెబుతున్నారు) ఇందులో ఏముందంటే.. ''హిందూ దేవుళ్లైన రాముడి మీద, కృష్ణుడి మీద న‌మ్మ‌కం లేద‌ని, వాళ్ల‌ను పూజించ‌మ‌ని, గౌరీ మీద‌, గ‌ణ‌ప‌తి మీద‌, ఇత‌ర హిందూ దేవత‌ల మీద న‌మ్మ‌కం లేద‌ని, వాళ్ల‌ను పూజించ‌మ‌ని, శ్రాద్ధ క‌ర్మ‌లు పాటించ‌మ‌ని పిండ‌దానాలు చేయ‌బోమ‌ని ప్రతిజ్ఞ చేస్తున్నాము'' అంటూ సాగింది. ఇది హిందూ మ‌తాన్ని అవ‌మానించ‌డ‌మేన‌ని అప్ప‌ట్లో చ‌ర్చ జ‌రిగింది. అదే అంశంపై ఇప్పుడు కేసు కూడా న‌మోదైంది.

ఇలాంటి ఘ‌ట‌న‌ల‌తో.. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఉండి.. త‌న ల‌క్ష్యం వైపున‌కు వెళ్ల‌డం సాధ్యం కాద‌ని ప్ర‌వీణ్ కుమార్ భావించిన‌ట్టున్నారు. అందుకే.. రాజీనామా చేసి, రాజ‌కీయం వైపు అడుగులు వేస్తున్నారు. త‌న రాజీనామా సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు రాసిన లేఖ‌లోనూ ప‌రోక్షంగా ఈ విష‌యాన్ని చెప్పారు. ''ఇక‌పై నా మ‌న‌సుకు న‌చ్చిన విధంగా, ఇష్ట‌మైన ప‌నులు చేసేందుకే వైదొలుగుతున్నాను'' అని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. అంతేకాకుండా.. ''బాబాసాహెబ్ అంబేద్క‌ర్‌, మ‌హాత్మ జ్యోతిరావు పూలే, కాన్షీరాం మార్గంలో న‌డుస్తాను. భావిత‌రాల‌ను కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తాను.'' అని స్పష్టం చేశారు. ఆ విధంగా.. రాజ్యాధికారం సాధించ‌డం ద్వారానే.. ద‌ళిత‌, బ‌హుజ‌నుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు ప‌రోక్షంగా వెల్ల‌డించారు ప్ర‌వీణ్ కుమార్‌. ఇక‌, ఇప్పుడు బీఎస్పీలో చేర‌డం కూడా దాదాపుగా ఖ‌రారైపోయింది. మ‌రి, రాజ‌కీయ ముఖ‌చిత్రంపై ప్ర‌వీణ్ కుమార్ ఎలాంటి ముద్ర వేస్తార‌న్న‌దే తేలాలి.