Begin typing your search above and press return to search.

మేధావులంతా త‌మ‌తో క‌ల‌వాలంటున్న మ‌త‌పెద్ద‌

By:  Tupaki Desk   |   17 Oct 2017 5:36 AM GMT
మేధావులంతా త‌మ‌తో క‌ల‌వాలంటున్న మ‌త‌పెద్ద‌
X
హిందూమతం ఏ మతానికి శత్రువు కాదని, అలాగని హిందూమతాన్ని కించపరిచేలా ఎవరు ప్రయత్నించినా ఊరుకునే ప్రసక్తి లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ భాయి తొగాడియా స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం నుంచి లౌకిక - సామ్యవాద పదాలను తొలగించి హిందూ పదాన్ని జోడించాలని - భారత్‌ ను హిందూ రిపబ్లిక్‌ దేశంగా మార్చాలని కోరారు. సోమవారం ఉదయం ఖమ్మంలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడుతూ హిందువులు అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్ర‌తి గ్రామంలోనూ హిందువులు ప్రబల శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి పౌరుడు ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలని, అంతకంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించాలన్నారు. దేశంలో జనాభా నియంత్రణలో ఉంటే ఉద్యోగ - ఉపాధి - రాజకీయ రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. దేశంలో హిందూ మతానికి చెందిన వారు అధికారంలో ఉంటేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రవీణ్‌ భాయి తొగాడియా అన్నారు.

దేశరక్షణ పటిష్టంగా ఉండాలంటే హిందూవాదమే శరణ్యమని ప్రవీణ్‌ భాయి తొగాడియా చెప్పారు. హిందూవులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారత్‌లో హిందూ ప్రభుత్వం లేదన్నారు. అలా కాకుండా దేశంలో అన్నింటా హిందూ వాదమే ప్రతిబింబించాలన్నారు. ప్రధాని, కేంద్రమంత్రి, రాష్ట్రపతి - ముఖ్యమంత్రి - రాష్ట్రమంత్రి - గవర్నర్‌ - జడ్జి - కలెక్టర్‌ - సైనికులు - ఎస్పీ - ఎస్‌ ఐ - పోలీసులు - ఇలా అందరూ హిందూవులే ఉండాలని ప్రవీణ్‌ భాయి తొగాడియా అన్నారు.హిందూ మతం ఏ మతానికీ శత్రువు కాదనీ - తమ మతాన్ని కించపరిచే విధంగా ఎవరు వ్యాఖ్యానించినా సహించేది లేదని హెచ్చరించారు.

భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా తయారు చేసేందుకు విశ్వహిందూ పరిషత్ కసరత్తు చేస్తుందని ప్రవీణ్‌ భాయి తొగాడియా తెలిపారు. ఇప్పటికే ఇండియా హెల్త్‌ లైన్ ప్రారంభించామని, ఇందులో వైద్యులను భాగస్వామ్యులను చేసి రోజుకు లక్షమందికి ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ను ఆయన ప్రకటించారు. పేద రోగులకు అవసరమయ్యే వైద్య సహాయ వేదికగా ఇది పనిచేస్తుందన్నారు. దీనిలో ఆరోగ్య సహాయకులుగా ఎవరైనా చేరవచ్చని పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ప్రజా సేవలో నిమగ్నం కావాలని, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూనే దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉందన్నారు. ప్రభుత్వం ఏదో చేస్తుందని చూసేకంటే తామే ముందు సేవామార్గం వైపు పయనించాలని ప్రవీణ్‌భాయి తొగాడియా సూచించారు. తమ మార్గంలోకి ఇప్పటికే వేలాదిమంది మేధావులు వచ్చారని, వారంతా సేవా కార్యక్రమాల ద్వారా దేశాభివృద్ధిలో కీలకంగా మారనున్నారని స్పష్టం చేశారు.