Begin typing your search above and press return to search.

వీహెచ్‌ పీలో క‌ల‌క‌లం.తొగాడియా గుడ్‌ బై...

By:  Tupaki Desk   |   15 April 2018 6:21 AM GMT
వీహెచ్‌ పీలో క‌ల‌క‌లం.తొగాడియా గుడ్‌ బై...
X
కొద్దికాలం క్రితం ఆచూకీ తెలియకుండా పోయి - చివరకు అపస్మారక స్థితిలో ఆస్ప‌త్రిలో కనిపించిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌ పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా మ‌రోమారు అనూహ్య రీతిలో మీడియా ముందుకు వచ్చారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తనకు వ్యతిరేకంగా కుట్రకు పాల్పడుతున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాకుండా తనను చంపేందుకు కుట్ర పన్నారంటూ ఆయన కన్నీటి పర్యంతమయిన ఉదంతం గుర్తుండే ఉంటుంది. ఆ నాట‌కీయ ప‌రిణామాలు కొద్దికాలం త‌ర్వాత స‌ద్దుమ‌ణ‌గ‌గా..తాజాగా ఆయ‌నకు త‌న సుప‌రిచిత‌ వేదిక అయిన విశ్వ‌హిందూ ప‌రిషత్‌ లోనే ఊహించ‌ని ప‌రాభ‌వం ఎదురైంది. దీంతో ఆయ‌న దీక్ష‌కు సిద్ధ‌మ‌య్యారు.

ఇంత‌కూ ఏం జ‌రిగిందంటే...52 ఏళ్ల‌లో తొలిసారిగా వీహెచ్‌పీలో ఎన్నికలు జరప‌గా...తొగాడియాకు ప‌రాభ‌వం ఎదురైంది. వీహెచ్‌పీ అధ్యక్షుడిగా హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జే ఎన్నికయ్యారు. ప్రస్తుతం వీహెచ్‌పీ అధ్యక్షుడిగా ఉన్న రాఘవరెడ్డిపై 71 ఓట్ల ఆధిక్యంతో కోక్జే గెలు పొందారు. రాఘవరెడ్డికి 60 ఓట్లు, కోక్జేకు 131 ఓట్లు పోలయ్యాయి. రాఘవరెడ్డి తన ప్యానెల్‌లోకి ప్రవీణ్ తొగాడియాను తీసుకోవడంతో కోక్జే గెలుపొందారని తెలుస్తోంది. సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికవ్వగానే కార్యవర్గాన్ని నియమించిన కోక్జే.. తొగాడియాకు చోటు కల్పించలేదు. దీంతో వీహెచ్‌పీలో తొగాడియా శకం ముగిసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై ఆగ్రహించిన తొగాడియా మీడియాతో మాట్లాడుతూ వీహెచ్‌పీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుండి హిందూత్వ అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆమరణ నిరహరదీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.

హిందూత్వ అంశానికి సంబందించి తాను ఉద్యమాన్ని చేస్తూనే ఉంటానని తొగాడియా ప్ర‌క‌టించారు. చెప్పారు. హైందవ సంస్కృతిపై జరిగే దాడిని అడ్డుకోవడంతోపాటు అయోధ్యలో రామాలయ నిర్మాణం తన ప్రధాన లక్ష్యంగా తొగాడియా స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని తక్షణం చేపట్టాలంటూ ఇక ఎంతకాలం రామభక్తులు ఎదురు చూస్తుంటారని ప్రశ్నించారు. త‌న గొంతు నొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాగా, తొగాడియాకు ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచే వీహెచ్‌ పీలో పొగ‌బెట్టార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌న‌వరి 26న‌ అలహాబాద్‌లో జరిగిన మార్గదర్శక్‌ మండల్‌ - సంత్‌ ల సమావేశంలో ప్రవీణ్‌ తొగాడియా పాల్గొంటున్న‌ప్పటికీ....ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌ విషయాన్ని చర్చించరాదని ఏకంగా తీర్మానం చేసింది.