Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ కావాల‌ని దేవుడిని మొక్కండిః సుప్రీం జ‌స్టిస్

By:  Tupaki Desk   |   1 Jun 2021 2:59 PM GMT
వ్యాక్సిన్ కావాల‌ని దేవుడిని మొక్కండిః సుప్రీం జ‌స్టిస్
X
దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ న‌త్త‌న‌డ‌క‌ను త‌ల‌పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌య‌మై సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తి జస్టిస్ చంద్ర‌చూడ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. దేశంలో అంద‌రికీ వ్యాక్సిన్ అందాలంటే దేవుడిని ప్రార్థించాల‌ని అన్నారు. ఓ కేసు సంద‌ర్భంగా జ‌డ్జి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

క‌రోనా విజృంభిన నేప‌థ్యంలో గ‌త సంవ‌త్స‌రం మార్చి నుంచి సుప్రీంలో కేసుల విచార‌ణ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. ఓ పిటిష‌న‌ర్ త‌ర‌పు లాయ‌ర్ మాట్లాడుతూ.. ఈ కేసు తదుపరి విచారణ ఇలా వీడియో కాన్ఫ‌రెన్స్ లో కాకుండా.. న్యాయ‌స్థానంలో భౌతికంగా జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నట్టు చెప్పారు.

దీనికి జ‌స్టిస్ చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఎంఆర్ షా ధ‌ర్మాస‌నం స్పందిస్తూ.. ''ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా టీకా వేసినప్పుడు మాత్రమే భౌతిక విచారణకు అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరగా టీకా వేయాలని భగవంతుడిని ప్రార్థించండి’’ అని వ్యాఖ్యానించారు. దీంతో.. దేశంలో నెలకొన్న టీకా పరిస్థితిని పరోక్షంగా సుప్రీం వ్యక్తం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండ‌గా.. ఈ ఏడాది చివ‌రి నాటికి దేశంలో 18 సంవ‌త్స‌రాలు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్ వేస్తామ‌ని కేంద్రం సుప్రీంకు తెలిపిన విష‌యం తెలిసిందే. దీనిపై సుప్రీం స్పందిస్తూ.. టీకాల అమ్మ‌కాల‌పై ప్ర‌శ్నించింది. కేంద్రానికి, రాష్ట్రాల‌కు, ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు వేర్వేరు ధ‌ర‌లు ఉండ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించింది. అదేవిధంగా.. ధ‌ర‌ల నిర్ణ‌యం వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌ల‌కు వ‌దిలి పెట్ట‌డ‌మేంట‌ని నిల‌దీసింది.