Begin typing your search above and press return to search.

చివరి అస్త్రాన్ని ప్రయోగించనున్న నేతలు

By:  Tupaki Desk   |   20 Jan 2022 9:49 AM GMT
చివరి అస్త్రాన్ని ప్రయోగించనున్న నేతలు
X
పీఆర్సీ అమలు డిమాండ్ పై ఉద్యోగ సంఘాల నేతలు చివరి అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. శుక్రవారం నాడు సమ్మె చేయటానికి వీలుగా చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు శుక్రవారం నోటీసు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలన్న నిబంధనల కారణంగా రేపు నోటీసు ఇస్తున్నారు. పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

పీఆర్సీలో భాగమైన ఫిట్మెంట్ ను తగ్గించినా ఉద్యోగ సంఘాల నేతలు సర్దుకున్నారు. ఇతరత్రా లబ్ది జరుగుతోంది కాబట్టే ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ హెచ్ఆర్ఏ బాగా తగ్గిపోవటం, సీసీఏ రద్దు చేయడం, ఇకనుండి ఐదేళ్ళకొకసారి కాకుండా వేతన సవతరణ పదేళ్ళకొకసారి చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేయటాన్ని ఉద్యోగ సంఘాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. హెచ్ఆర్ఏ విషయంలోనే నేతలంతా ప్రధానంగా పట్టుబడుతున్నారు.

చీఫ్ సెక్రటరీ ఏమో జీతాలు తగ్గనపుడు ఉద్యోగులెవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటు కొన్ని లెక్కలను, ఉదాహరణలను వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలతో చీఫ్ సెక్రటరీ అండ్ కో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అయితే చీఫ్ సెక్రటరీ చెప్పిన లెక్కలన్నీ తప్పంటు తర్వాత ఉద్యోగ నేతలు వాదిస్తున్నారు. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న డీఏలన్నింటినీ ఒకేసారి అమలు చేస్తున్న కారణంగా మాత్రమే జీతాలు పెరిగినట్లు కనబడుతోందంటు ఉద్యోగ నేతలు మండిపోతున్నారు.

మొత్తానికి పీఆర్సీ వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. ఉద్యోగ నేతల తాజా స్టాండ్ ను బట్టి చూస్తే ఈసారి గట్టిగానే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటించాలని డిసైడ్ అయినట్లే ఉన్నారు. మరి ఈ సమస్య ఎంతదాకా వెళుతుందో ఎప్పుడు పరిష్కారమవుతుందో చూడాలి. ఉద్యోగ నేతల నోటీసు పీరియడ్ ప్రకారం చూస్తే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సమ్మె చేయాలని అనుకున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.