Begin typing your search above and press return to search.

పీఆర్సీ అంటే.. పే రిడ‌క్ష‌న్ క‌మిష‌నా..?

By:  Tupaki Desk   |   21 Jan 2022 5:22 AM GMT
పీఆర్సీ అంటే.. పే రిడ‌క్ష‌న్ క‌మిష‌నా..?
X
ఏపీలో ఉద్యోగులు రోడ్డెక్కారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పీఆర్సీ విష‌యంలో తీవ్ర స్థాయిలో ర‌గిలిపోతు న్నారు. అంతేకాదు.. శుక్ర‌వారం నుంచి మ‌రింత‌గా ఉద్యోగులు ప్ర‌భుత్వంపై ఉద్య‌మించేందుకు మ‌రింత ప‌టిష్ట ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రికి వారు గా ఉద్య‌మాలు చేశాయి. అయితే.. ఇప్పుడు అన్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చాయి. ఉమ్మడి సంఘంగా ఏర్ప‌డి.. ఉద్య‌మ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసేందుకు రెడీ అయ్యాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. పీఆర్సీ అంటే.. పేరివిజ‌న్ క‌మిష‌న్ అని.. కానీ.. ప్ర‌భుత్వం దీనిని పే రిడ‌క్ష‌న్ క‌మిష‌న్‌గా మార్చార‌ని.. ఉద్యోగులు అంటున్నారు.

వాస్త‌వానికి ఎక్క‌డైనా.. ఏ ప్ర‌భుత్వమైనా పీఆర్సీ ప్ర‌క‌టిస్తే.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న జీతాల్లో పెంపు క‌నిపిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు రూ.20000 తీసుకునే ఉద్యోగి వేత‌నం మ‌రో రెండువేలు పెరుగుతుంది.. దీంతో అది రూ.22000 కు చేరుతుంది. కానీ, ఇప్పుడు ఏపీలో ప్ర‌క‌టించిన ఫిట్‌మెంట్‌ను ప‌రిశీలిస్తే.. ఉద్యోగుల‌కు 400 నుంచి 600 వేత‌నం త‌గ్గుతోంది. పెద్ద ఉద్యోగులు అయితే.. ఈ త‌గ్గుద‌ల ఏకంగా రూ.4000 వ‌ర‌కు ఉంటోంది. దీనినే ఉద్యోగులు తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌డుతున్నారు. వాస్త‌వానికి సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర జ‌రిగిన స‌మావేశంలో ప‌పీఆర్సీని ప్ర‌క‌టించిన‌ప్పుడు.. ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేశారు.

62 ఏళ్ల‌కు రిటైర్మెంట్ వ‌య‌సును పెంచ‌డం, ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన జ‌గ‌న‌న్న టౌన్ షిప్‌ల‌లో ఉద్యోగుల‌కు ఇళ్ల‌ను కేటాయించ‌డం వంటివివారికి ఆనందాన్ని నింపాయి. కానీ, త‌ర్వాత‌.. లెక్క‌లు వేసుకున్న ఉద్యోగులు.. త‌మ జీతాలు త‌గ్గిపోతున్నాయ‌ని గుర్తించారు. దీంతో ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ విష‌యం ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగుల‌కు ప్ర‌బుత్వానికి మ‌ధ్య తీవ్ర యుద్ధానికి దారితీసింది. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని.. ఉద్యోగులు స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రోవైపు... జీతాలు త‌గ్గ‌వ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. వాస్త‌వ లెక్క‌లు క‌ళ్ల‌కు క‌నిపిస్తుండ‌డంతో వారు వెన‌క్కి త‌గ్గేది లేద‌ని అంటున్నారు.

ఇక‌, ఈ విష‌యంపై మీడియా చానెళ్ల‌లోనూ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చిన మంత్రి డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు.. కొన్ని లెక్క‌లు వేశారు. అన్ని అంశాల‌ను లైవ్‌లోనే ఆయ‌న ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని.. ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం మేలు చేస్తోంద‌ని చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ, లెక్క‌లు వేసిన మంత్రికే జీతం త‌గ్గుతున్న విష‌యం.. స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో లైవ్ నుంచి వెళ్లిపోయారు. అంటే.. ఉద్యోగులు చెబుతున్న విష‌య‌మే క‌రెక్ట్ అంటున్నారు. ఈ ప‌రిణామాల నుంచి ప్ర‌భుత్వం బ‌య‌ట‌ప‌డ‌డం ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.