Begin typing your search above and press return to search.

ఈసీ అదిరే రూల్‌ తో నేత‌లు ఆగ‌మాగం!

By:  Tupaki Desk   |   7 Nov 2018 5:51 AM GMT
ఈసీ అదిరే రూల్‌ తో నేత‌లు ఆగ‌మాగం!
X
వీరుడు.. శూరుడు.. మొన‌గాడు.. పులి.. సింహం.. ఇలా ర‌క‌ర‌కాల పొగ‌డ్త‌ల‌తో రాజ‌కీయ‌నేత‌ల్ని కీర్తిస్తూ ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌ల్ని ఇప్ప‌టివ‌ర‌కూ చూశాం. రానున్న కొద్ది రోజుల్లో ఇందుకు భిన్న‌మైన ప్ర‌క‌ట‌ల్ని ప‌త్రిక‌ల్లో చూసే ప‌రిస్థితి తెలుగు ప్ర‌జ‌ల‌కు.. అందునా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రానుంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా అమ‌లు చేస్తున్న కొత్త విధానంతో ఈ ప‌రిస్థితి రానుంది.

ఇంత‌కీ ఈ కొత్త విధానం ఏమంటే.. ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు త‌మ నేర‌చ‌రిత్ర‌కు సంబంధించిన వివ‌రాల్ని క‌చ్ఛితంగా ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌ల రూపంలో ఇవ్వాల్సిందే. అదీ ఒక్క‌సారి కాదు.. మూడుసార్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక‌వేళ అలా ఇవ్వ‌కుంటే వారిపై చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లుగా భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది.

నేర చ‌రిత్ర ఉన్న నేత‌లు ఆ వివ‌రాల్ని ప‌త్రిక‌ల్లో మూడుసార్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు.. టీవీల్లోనూ స‌మాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రూల్ ను భార‌త ఎన్నిక‌ల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి విధిగా అమ‌లు చేయ‌నుంది. దీంతో.. కేసులున్న అభ్య‌ర్థులు త‌మ నేర చ‌రిత‌కు సంబంధించిన వివ‌రాల్ని యాడ్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఇలా త‌మ‌కు సంబంధించిన ప‌చ్చి నిజాల్ని ప్ర‌క‌ట‌న‌ల రూపంలో ఇచ్చినందుకు అయ్యే ఖ‌ర్చును ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల చేసే ఖ‌ర్చు కింద‌నే ప‌రిగ‌ణిస్తారని ఈసీ పేర్కొంది. దీనిపై టీఆర్ ఎస్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. ప‌త్రిక‌ల్లో మూడు ద‌ఫాలు..టీవీల్లో అయితే 7 సెక‌న్ల నిడివి త‌గ్గ‌కుండా త‌మ కేసుల వివ‌రాల్ని వెల్ల‌డించాల‌ని పేర్కొంది. ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌ల్ని తాము చేసిన విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘానికి త‌ప్ప‌నిస‌రిగా జ‌త చేయాల‌న్న రూల్ ను పెట్టింది. మొత్తంగా చూస్తే.. ఈసారి ఎన్నిక‌ల సంద‌ర్భంగా వీరుడు.. శూరుడు అంటూ త‌మ‌ను తాము పొగుడుకునే యాడ్స్ తో పాటు.. త‌మ నేర చ‌రిత‌ను చెప్పుకునే ప్ర‌క‌ట‌న‌ల్ని అభ్య‌ర్థులు ఎలా త‌యారు చేయిస్తార‌న్న‌ది ఇప్పుడెంతో ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి.