Begin typing your search above and press return to search.

నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల రిజ‌ల్ట్స్ ఇలా ఉంటాయ‌ట‌

By:  Tupaki Desk   |   10 Oct 2018 4:19 AM GMT
నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల రిజ‌ల్ట్స్ ఇలా ఉంటాయ‌ట‌
X
అర‌వై రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో జ‌రిగే ఎన్నిక‌ల అంశం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తెలంగాణ‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్‌.. ఛ‌త్తీస్ గ‌డ్‌.. మిజోరం రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వివిధ తేదీల్లో ఈ రాష్ట్రాల పోలింగ్ జ‌రుగుతున్నా.. ఓట్ల లెక్కింపు మాత్రం డిసెంబ‌రు 11న ఉద‌యం 8 గంట‌ల‌కు షురూ కానుంది.

ఇదిలా ఉంటే.. మిజోరం మిన‌హా మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉండ‌నున్నాయి? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది సీ వోట‌ర్‌.. టైమ్స్ నౌ.. ఐటీ టెక్ గ్రూప్ కు చెందిన ఇత‌ర సంస్థ‌లు. స‌ర్వేల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లుగా పేర్కొన్న ఈ సంస్థ‌లు తాజాగా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయో పేర్కొన్నారు.

ఇందులో మొద‌టిది తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. మొత్తం 119 స్థానాల‌పై రెండు సంస్థ‌లు వేర్వేరుగా స‌ర్వేలు నిర్వ‌హించిన‌ట్లుగా పేర్కొన్నారు. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఈ రెండు సంస్థ‌ల అంచ‌నా ప్ర‌కారం తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ మ‌ళ్లీ ప‌వ‌ర్లోకి రానున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. దాదాపు 85 సీట్ల‌ను టీఆర్ ఎస్ సొంతం చేసుకుంటుంద‌ని.. కాంగ్రెస్ 18.. మ‌జ్లిస్ 7.. బీజేపీ 5.. ఇత‌రులు నాలుగు సీట్ల‌లో గెల‌వ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున మాట‌ల దాడి చేస్తున్నా.. విమ‌ర్శ‌ల జ‌డివాన కురిపిస్తున్నా.. గులాబీ బ్యాచ్ కు అనుకూలంగా అంతిమ తీర్పు ఉంటుంద‌ని చెబుతున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం అధికార‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీకే మ‌రోసారి ప‌వ‌ర్ క‌ట్ట‌బెడ‌తార‌ని చెబుతున్నారు. మొత్తం 230 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన స‌ర్వేల్లో బీజేపీకి 126.. కాంగ్రెస్‌కు 97.. ఇత‌రుల‌కు ఏడు సీట్లు రావొచ్చ‌ని అంచ‌నా వేశారు.

రాజ‌స్థాన్ విష‌యానికి వ‌స్తే అధికార బీజేపీకి ఈ ఎన్నిక‌ల్లో ఎదురుదెబ్బ ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇక్క‌డున్న మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 129 స్థానాల్లో గెలుస్తుంద‌ని.. బీజేపీకి 63.. ఇత‌రుల‌కు 8 సీట్లు గెలిచే వీలుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ప్ర‌తి ట‌ర్మ్ కు అధికార‌ప‌క్షానికి షాకిచ్చే రాజ‌స్థాన్ రాష్ట్ర ప్ర‌జ‌లు ఈసారి బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటు వేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇక‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రానికి వ‌స్తే.. ఇప్ప‌టికే మూడుసార్లు బీజేపీ కూట‌మి విజ‌యం సాధించిన నేప‌థ్యంలో.. ఈసారి చాలా స్వ‌ల్ప అధిక్య‌త‌తో కాంగ్రెస్ గెలిచే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వే పేర్కొంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్న ఈ రాష్ట్రంలో మేజిక్ ఫిగ‌ర్ 46 కాగా.. కాంగ్రెస్ అధికారానికి అవ‌స‌ర‌మైన స్థానాల కంటే కేవ‌లం ఒకే ఒక్క స్థానం మాత్ర‌మే అధికంగా వ‌స్తుంద‌న్న అంచ‌నా వేశారు. నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ చేతికి వెళ్లిపోతుండ‌గా.. మ‌రో రెండు రాష్ట్రాల్లో మాత్రం అధికార‌ప‌క్ష‌మే గెలుస్తుంద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.